Tirupati: తిరుపతిని గ్రేటర్ గా మార్చాడానికి రంగం సిద్దమైంది. అయితే వ్యతిరేకత కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా తిరుపతి పరిసరాల పంచాయితీల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రేటర్లో భాగం అయితే తమ ప్రాబల్యం తగ్గిపోయి అధికారుల పెత్తనం ఎక్కువవుతుందని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. అధికార ప్రతిపక్షంలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా నగర పాలక సంస్థ సమావేశంలో గొడవ జరిగింది.. ఇక ప్రజలు గ్రేటర్ పేరుతో పన్నుల భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
తిరుపతిని గ్రేటర్‌గా మారుస్తూ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా జైకొట్టారు. కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన ప్రతులను, విలీన ప్రతిపాదనలను కలెక్టర్ శుక్రవారమే సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు పంపించారు. ఆయా పంచాయతీల నుంచి విలీన తీర్మానాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఏది ఏమైనా డిసెంబరు నెలాఖరులోపు గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
మొత్తమ్మీద ఈ ఏడాది ప్రారంభంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చేపట్టిన కసరత్తు ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది. సంస్కరణలకు, దార్శనికతకు పేరుపడిన సీఎం చంద్రబాబు తిరుపతి నగర అభివృద్ధిపై తొలి నుంచీ శ్రద్ధాసక్తులు చూపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో నారావారిపల్లికి వచ్చిన సందర్భంలో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్‌కు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అందులో గ్రేటర్ తిరుపతి ఒకటి. అప్పట్నుంచి జిల్లా యంత్రాంగం దీనిపై కసరత్తు ప్రారంభించింది.
తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని 53 పంచాయతీలకు సంబంధించిన 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని 53 పంచాయతీలకు సంబంధించిన 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
గ్రేటర్‌గా మారితే తిరుపతి నగర రూపురేఖలు అనూహ్యంగా మారిపోనున్నాయి. ఇపుడు కేవలం 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన తిరుపతి.. 284 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. 4.50 లక్షల జనాభా 7.50 లక్షలకు పెరగనుంది. రూ.149 కోట్లుగా ఉన్న వార్షికాదాయం రూ.182 కోట్లకు చేరనుంది. చంద్రగిరి, రేణిగుంట వంటి మేజర్ పంచాయతీ కేంద్రాలు తిరుపతిలో అంతర్భాగం కావడంతో పాటు విమానాశ్రయం వెలుపలున్న వికృతమాల దాకా నగరం విస్తరించనుంది. పారిశ్రామిక వాడలు సైతం నగరపాలక సంస్థలో కలవనున్నాయి
రాజకీయంగా మాత్రం శ్రీకాళహస్తి, చంద్రగిరికు ఇబ్బంది పరిణామంగా మారనుంది. మెజార్టీ సీట్లు ఉన్న తిరుపతి నగరానికి చెందిన ఎమ్మెల్యేల హావా సహాజంగానే నడుస్తోంది. మిగతా ఇద్దరు ప్రజా ప్రతినిధులు ప్రాధాన్యత నామా మాత్రంగా ఉంటుంది. దీనికి తోడు నగర పాలక సంస్ధలో కార్పోరేటర్ల పెత్తనం ఎక్కువుగా ఉంటుంది. మరో వైపు అధికారుల పెత్తనం కూడా నడుస్తోంది. దీంతో స్థానిక నాయకుల మాట చెల్లు బాటు అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.
ముఖ్యంగా ప్రస్తుతం తిరుపతి నగరం పరిస్థితి తీసుకుంటే ఇప్పుడున్న నగర పాలక సంస్థ పరిధిలోనే రహాదారుల మరమత్తులు చేయలేని స్థితిలో ఉంది. తిరుపతి కార్పొరేషన్ గా మారినప్పుడు జీవకోనతో పాటు కొన్ని పంచాయితీలు కలిసాయి. వాటిలోనే మౌళిక సదుపాయాలు 15 సంవత్సరాలు అయినా ఏర్పాటు చేయలేక పోతుంది. ఇప్పటికి చాలా ప్రాంతాలలో రహాదారులతో పాటు డ్రైనేజ్ సౌకర్యం కల్పించలేదు.15 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగిన పరిస్థితి. మిగతా కాలమంతా అధికారుల పెత్తనం నడిచింది. ఇక్కడ పనిచేసే ఐఎఎస్ అధికారులు తాము సీఎం మాట మాత్రమే వింటామనే ధోరణిలో ఉంటారు. దీని వల్ల స్థానిక నాయకత్వం మాట వినరనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితులలో పంచాయితీ స్థాయి నాయకులు గ్రేటర్ ను వ్యతిరేకిస్తున్నారు..
మరో వైపు వైకాపా డబల్ గేమ్ రాజకీయం చేస్తుంది. వైసీపీ చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల సర్వసభ్య సమావేశాలలో గ్రేటర్ లో పంచాయితీలు కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసింది. ప్రజలు కూడా పన్నులు, అవినీతి దందాల్లో ఇరుక్కు పోతామని భయపడుతున్న పరిస్థితి.. పంచాయితీగా ఉంటే ఎమ్మెల్యే చెబితే తుడాతో పాటు పంచాయితీ అనుమతులు వస్తాయంటున్నారు. గ్రేటర్‌లో కలిస్తే మాత్రం టౌన్ ప్లానింగ్ అవినీతి అధికారులకు ఖచ్చితంగా అమ్యామ్యా చెల్లించాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
తాజాగా తిరుపతి నగరంలో ఇంటి నిర్మాణానికి ఖచ్చితంగా పన్నులతో పాటు లంచం కూడా చెల్లించాలనే విషయంపై గొడవలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో లంచాలకు మరిగిన అధికారులు మారరు అనే విషయం బయటపడింది..ఇలాంటి సమయంలో గ్రేటర్ పేరుతో రొకలి నోట్లో తలపెట్టడానికి ప్రజలు సిద్దంగా లేరని అంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని లేక పోతే పార్టీల కతీతంగా ప్రజలతో అందోళన చేయించడానికి పంచాయితీ స్థాయి నాయకులు సిద్దమవుతున్నారంట. మొత్తం మీదా గ్రేటర్ పేరుతో తిరుపతి కార్పొరేషన్ చేసిన తీర్మానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Story by Apparao,Big Tv