AP Schools Holiday: ఏపీ వైపు మొంథా తుపాను గంటకు 15 కి.మీ వేగంతో దూసుకొస్తుంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తు్న్నారు. తుపాను నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలో ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది చెన్నైకి 420 కి.మీ, విశాఖపట్నంకు 450 కి.మీ, కాకినాడకు 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని వెల్లడించారు.
విశాఖ, కడప, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రేపు(అక్టోబర్28) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనకాపల్లి, విజయనగరం, మన్యం, బాపట్ల, అల్లూరి జిల్లాల్లో ఎల్లుండి వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో స్కూళ్లు యథావిధిగా కొనసాగనున్నాయి.
తుపాను ప్రభావంతో స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవులు ఇచ్చారు. పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలీడే ప్రకటించారు. కాకినాడ జిల్లాలో ఈ నెల 31 వరకు సెలవు ఇచ్చారు. మిగతా జిల్లాల్లో జూనియర్ కాలేజీలు యథావిధిగా కొనసాగనున్నాయి.
ఏపీపై తుపాను తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖల హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ సుమారు 100 రైళ్లను రద్దు చేసింది. తాజాగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ ఎయిర్ పోర్టు మీదుగా రాకపోకలు సాగించే ఫ్లైట్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దిల్లీ వెళ్లే విమానాలు తప్ప మిగిలిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. విశాఖ నుంచి వెళ్లే ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.
మొంథా తుపానుపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి తుపానును సమర్ధవంతంగా ఎదుర్కోవాలని, మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదని అన్నారు.
మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
Also Read: Cyclone Montha: మొంథా తుఫాను.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు
ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు.