APSRTC Sabarimala Buses: ఏపీఎస్ఆర్టీసీ అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల వెళ్లే భక్తులకు మూడు రకాల యాత్ర ప్యాకేజీలు ప్రకటించింది. డిసెంబర్ 12 వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి శీఘ్రయాత్ర, సత్వర యాత్ర, యాత్ర సర్వీస్ ల పేరిట మూడు రకాల ప్యాకేజీలను ఆర్టీసీ ప్రకటించింది.
5 రోజుల శీఘ్ర యాత్ర ప్యాకేజీలో.. బస్సు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. విజయవాడ, మేల్ మరుతుర్, ఎరుమేలి మీదుగా పంబ సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. సూపర్ లగ్జరీ,అల్ట్రాడీలక్స్ బస్సులకు ఒక్కొక్కరికి రూ.6,660, ఇంద్ర(AC) బస్సులో రూ.8,500 టికెట్ ఛార్జీ నిర్ణయించారు.
ఆరు రోజుల సత్వర యాత్ర ప్యాకేజీలో బస్సు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి మీదుగా పంబ సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి, శ్రీకాళహస్తి, అన్నవరం మీదుగా విశాఖ చేరుకుంటారు. ఒక్కొక్క రికి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు అయితే రూ.7వేలు, ఇంద్ర(AC) సర్వీస్ అయితే రూ.9 వేలు టికెట్ ఛార్జీగా నిర్ణయించారు.
ఈ యాత్రలో విశాఖ నుంచి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి మీదుగా పంబ సన్నిధానం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖ చేరుకుంటారు. ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రూ.7,600, ఇంద్ర(ఏసీ) సర్వీస్ రూ.10 వేలుగా నిర్ణయించారు.
గతేడాది విశాఖ నుంచి శబరిమలకు నాలుగు సర్వీసులు తిప్పగా ఈ ఏడాది విశాఖ డిపో నుంచి శబరిమలకు 20 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు. పంచారామాలకు ఇంద్ర ఏసీ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నామన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.2,800గా నిర్ణయించారు. వీటిపై పూర్తి వివరాలకు 99592 25594, 73829 14219 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
Also Read: First Private Train: భారత్ లో ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్.. వేగం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!
శబరిమల యాత్ర వివరాల కోసం 73829 14219 నెంబర్ ను సంప్రదించవచ్చు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కోసం http://www.apsrtconline. in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.