Jupally Krishna Rao: తనపై పని కట్టుకుని ఒక వర్గం మీడియా, సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని, వికృత రాజకీయాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
ఆర్టీఐ ద్వారా కొన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అడిగించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రచురించిన కథనాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. “నా పరువుకు భంగం కలిగించేలా, నన్ను అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు, వర్గాలు ఈ విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.” అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ALSO READ: OTT Movie : పక్కింటి అమ్మాయిపై ఆ ఫీలింగ్…తేడా అంటూ కోడై కూసే ఊరు… మస్ట్ వాచ్ మలయాళ మూవీ
అసత్య ప్రచారంపై చట్టపరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించామని, ఆ వార్తను ప్రచురించిన సంస్థలు, సోషల్ మీడియా పోస్టుల వెనుక ఉన్న బాధ్యులైన వ్యక్తులపై పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.“ప్రజాసేవకుడిగా నేను ఎల్లప్పుడూ ప్రజల మన్ననలు పొందే విధంగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా పని చేస్తున్నాను. నాకు ఉన్న రాజకీయ ప్రస్థానం ప్రజల నమ్మకం మీదే నిలిచింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో నా పేరు చెడగొట్టాలన్న ప్రయత్నాలు విఫలమవుతాయి.” అని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
‘‘ఏ సమాచారమైతే ప్రజలకు చేరవేస్తారో.. అది నిజ నిర్ధారణ చేసుకుని ప్రచురించాలి. కేవలం పుకార్ల ఆధారంగా కథనాలు రాయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది,” అని హెచ్చరించారు. తనపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, తగిన చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బోథ్‌లో కూడా ఓ సభలో తాను మాట్లాడిన విషయాలను వక్రీకరించి బురద చల్లే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు ఇలా కట్టుకథలు అల్లి ఒక పథకం ప్రకారం తనను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నవారికి లీగల్ నోటీసులు పంపుతామని.. పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.