Liquor shops: తెలంగాణ రాష్ట్రంలో 2601 మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ డ్రా పద్ధతిలో ప్రశాంతంగా పూర్తయింది. ఈ డ్రా సమయాల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. రాష్ట్రంలోని మొత్తం 2620 మద్యం షాపుల కోసం ప్రభుత్వం ఆహ్వానించగా.. ఏకంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ భారీ స్పందన కారణంగా దరఖాస్తు రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ. 2845 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఈ గణనీయమైన మొత్తం ప్రభుత్వ ఖజానాకు అదనపు బలాన్ని చేకూర్చింది.
తెలంగాణలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో డ్రా ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు దరఖాస్తుదారుల సమక్షంలోనే డ్రా ద్వారా విజేతల పేర్లను ప్రకటించారు. ఈ పద్ధతి ద్వారా కేటాయింపుల్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చూసుకున్నారు. మద్యం దుకాణాల డ్రాను సమర్థవంతంగా, ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకుగాను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ శ్ ఎక్సైజ్ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ముగియడంతో త్వరలోనే కొత్త లైసెన్సుదారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది.
19 మద్యం షాపులకు రేపు నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా 19 మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రొవహిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీ హరి కిరణ్ ఈ మేరకు సంబంధిత జిల్లాల ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఐదు ఎక్సైజ్ జిల్లాల్లో మొత్తం 19 మద్యం షాపులకు లైసెన్సులను జారీ చేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 7 మద్యం షాపులకు, అదిలాబాద్ జిల్లాలో 6 షాపులకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దీంతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలో ఒక మద్యం షాపునకు లైసెన్సులు కేటాయించనున్నారు.
ఎక్సైజ్ శాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 28 నుంచి నవంబర్ 1 వరకు కొనసాగనుంది. దరఖాస్తుల గడువు ముగిసిన అనంతరం, నవంబర్ 3న 19 మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులకు డ్రా (లాటరీ) నిర్వహించబడుతుంది. డ్రా ద్వారా ఎంపికైన అభ్యర్థులకు లైసెన్సులు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తుల రుసుము రూపంలో ఆదాయం సమకూరనుంది. మద్యం షాపులకు లైసెన్సు పొందగోరే అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ సూచించింది.