Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో.. టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమైన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలకపాత్ర వహించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే నాయకులందరూ సమిష్టిగా, శక్తివంతంగా కృషి చేయాలని, కేవలం విజయం సాధించడమే కాకుండా, అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు తమకు అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వర్తించాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రదర్శించవద్దని ఆయన స్పష్టం చేశారు.
ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఎన్నికల బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రణాళికను పటిష్టం చేయడంలో బూత్ స్థాయిలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని సూచించారు.
ALSO READ: Jubilee Hills bypoll: ఈవీఎంలో గుర్తులపై అభ్యంతరాలు.. బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందా..?
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని, దీన్ని ఓట్ల రూపంలో మలచుకోవడానికి నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు మరియు ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించేందుకు పటిష్టమైన ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. నాయకులంతా ఐకమత్యంగా ముందుకు సాగాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను సక్రమంగా నెరవేర్చి.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ తేదీని బట్టి, ఈ నెల రోజుల్లో మరింత ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగనుంది. ఈ సమీక్షా సమావేశం ద్వారా ఎన్నికల బాధ్యులకు పార్టీ కార్యాచరణ స్పష్టంగా అందిందని చెప్పవచ్చు.