Navratri 2025: నవరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. ఉపవాసాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇల్లు దేవాలయంలా మారుతుంది. అయితే.. ఈ పవిత్రమైన సమయంలో ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఉంచడం లేదా కొత్తగా కొనడం అశుభమని నమ్ముతారు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షించి, పూజా ఫలితాలను తగ్గిస్తాయని చెబుతుంటారు. మరి నవరాత్రి సమయంలో ఇంట్లో ఉంచకూడని లేదా కొనుగోలు చేయకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారం, మద్యం: నవరాత్రి ఉపవాసాలు కేవలం శరీర శుద్ధికి మాత్రమే కాదు. మనసును పవిత్రంగా ఉంచుకోవడానికి కూడా. ఈ తొమ్మిది రోజులు మాంసాహారం, మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను పూర్తిగా మానేయడం మంచిది. ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి.
పదునైన వస్తువులు: కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను కొత్తగా కొనుగోలు చేయకూడదు. ఈ వస్తువులు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయని.. ఇంట్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తాయని నమ్ముతారు.
పాత లేదా విరిగిన దేవుడి విగ్రహాలు: ఇంట్లో విరిగిన లేదా పాడైపోయిన దేవుడి విగ్రహాలు, చిత్రపటాలు ఉంటే వాటిని వెంటనే తొలగించడం మంచిది. ముఖ్యంగా నవరాత్రి సమయంలో ఇవి అశుభ ఫలితాలను ఇస్తాయి. వాటిని నదిలో నిమజ్జనం చేయడం లేదా పవిత్రంగా నిర్దేశించిన స్థలంలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.
పాత, తుప్పు పట్టిన ఇనుము వస్తువులు: తుప్పు పట్టిన ఇనుము వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. శని గ్రహంతో సంబంధం ఉన్న ఇనుమును నవరాత్రి సమయంలో కొనకూడదు. ఇది ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని విశ్వసిస్తారు.
లెదర్ వస్తువులు: లెదర్ (చర్మం) అనేది జంతువుల నుంచి తయారవుతుంది. నవరాత్రి సమయంలో దేవి పూజకు పవిత్రత చాలా ముఖ్యం. అందువల్ల, లెదర్ వస్తువులు, బెల్టులు, పర్సులు, బూట్లు వంటి వాటిని ఇంట్లో పూజా స్థలం దగ్గర ఉంచకూడదు. అలాగే కొత్తగా కొనుగోలు చేయకుండా ఉండటం కూడా మంచిది.
పనికిరాని వస్తువులు: ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా.. పరిశుభ్రంగా ఉండాలి. నవరాత్రికి ముందు పాత చెత్త, పనికిరాని వస్తువులను ఇంటి నుంచి బయట పారవేయడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
ఈ నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా.. మన జీవితంలో పవిత్రత, శుద్ధి, క్రమశిక్షణను పాటించడాన్ని సూచిస్తాయి. నవరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.