Jubilee Hills Bypoll Elections: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రాబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపును ఖాయం చేయడానికి సీఎం స్వయంగా ప్రచారంలోకి దిగనున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో మొదటి విడత ప్రచారం, నవంబర్ 4, 5 తేదీల్లో రెండో విడత ప్రచారం నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సీఎం ప్రచారం ప్రారంభమవుతుంది. మొదటి రోజు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డివిజన్లలో రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. 31వ తేదీన షాపూర్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్లలో ప్రచారం కొనసాగనుంది.
నవంబర్ 4,5 వ తేదీల్లో మరో రెండు రోడ్ షోలు ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. కాగా జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలువురు మంత్రులు ప్రచారాలు కూడా చేస్తున్నారు.
మంత్రి సీతక్క కూడా ఈ నియోజ వర్గంలో పర్యటించారు. తాజాగా రహమత్‌నగర్ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించిన ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అధోగతి పాలు చేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల అభివృద్ధి పట్ల కాకుండా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, స్థానికుడని పేర్కొంటూ ఆయనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, యువజన నాయకుడు భవానీ శంకర్, కాంగ్రెస్ సేవాదళ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
మరో మంత్రి వాకిటి శ్రీహరి సైతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు. సుమారు 18 కార్పొరేషన్ ఛైర్మన్లకు సైతం ప్రచారం బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. యాక్టివ్‌గా ఉండే కొందరు ఎమ్మెల్యేలకు సైతం జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతలు అప్పగించారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహ రచనలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ఏడాది కాలంలో చేసిన కీలక నిర్ణయాలు, రాబోయే పథకాలను ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: కొండా సుస్మిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు మహేశ్ కుమార్ హెచ్చరిక
రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ద్వారా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ దూకుడు స్పష్టమవుతోంది. రెండు విడతల్లో జరిగే ఈ ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని సృష్టించనుంది.