Diwali Vastu Tips: ప్రతి సంవత్సరం.. దీపావళి పండగను కార్తీక అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది.. దీపావళి అక్టోబర్ 20న వస్తుంది. పండగ సమయంలో దాదాపు ఒక నెల ముందుగానే.. అందరూ సన్నాహాలు ప్రారంభిస్తారు. దీపావళి అనేది వెలుగుల పండగ మాత్రమే కాదు.. ఇది ప్రతి ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుంది. ఈ రోజున.. లక్ష్మీ, గణపతి శుభ సమయంలో పూజిస్తారు. ఈ రోజు.. లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను పొందడంలో మీకు సహాయపడే వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం చాలా మంచిది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ దేవి రాక:
దీపావళికి ముందు ఇంటిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. ఈ సమయంలో.. మీరు ఇంట్లో అన్ని విరిగిన వస్తువులను, చెత్తను తీసివేయాలి. అలాగే.. ఇంట్లో ఎప్పుడూ ఆగిపోయిన గడియారాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. అలాగే.. లక్ష్మీ, గణపతి విగ్రహాలను ఈశాన్య లేదా తూర్పు ముఖంగా ఉంచాలి. పూజ సమయంలో.. మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. ఈ వాస్తు నియమాలను పాటించడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
తోరణాలు ఎలా ఉండాలి ?
ముఖ్యంగా దీపావళి వంటి ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో తోరణాలను వేలాడదీస్తారు . అవి అలంకారం కోసం మాత్రమే కాకుండా.. వాస్తు దృక్కోణం నుంచి ప్రయోజనకరంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి, మీరు తోరణాన్ని తయారుచేయడానకి మామిడి లేదా అశోక ఆకులను ఉపయోగించాలి. ఇది శుభ ఫలితాలను తెస్తుంది. తోరణంలో పసుపు లేదా ఎరుపు పువ్వులను ఉపయోగించడం ద్వారా కూడా మీరు ప్రయోజనం పొందవచ్చు.
రంగోలి ఎక్కడ వేయాలి ?
దీపావళి సందర్భంగా రంగోలి కూడా వేస్తారు. కాబట్టి.. మీరు దానిని ఎల్లప్పుడూ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తయారు చేసుకోవాలి. వృత్తాకారంలో రంగోలి వేయడం మరింత శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే.. పూలతో రంగోలిని తయారు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
Also Read: దీపావళి ఎఫెక్ట్, పెరగనున్న కాలుష్యం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దీపాలకు సంబంధించిన వాస్తు పరిహారాలు:
దీపావళి రోజున.. ఇంటి గుమ్మం వద్ద, తులసి మొక్కలో.. వంటగదిలో దీపాలు వెలిగించండి. అలాగే.. ప్రధాన ద్వారం యొక్క కుడ, ఎడమ వైపులా నూనె దీపాలను ఉంచండి. ఇది లక్ష్మీ దేవిని ఇంట్లోకి వచ్చేలాగా చేస్తుంది. దీపాల సంఖ్య 7, 11 లేదా 21 ఉండేలా చూసుకోండి.
ఈ పని తప్పకుండా చేయండి:
ముఖ్యంగా దీపావళి రోజున, పూజ గదిని తప్పకుండా శుభ్రం చేసి పూజించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ఉత్తర దిశలో పూజ గది ఉంచాలి. ఎందుకంటే ఈ దిశను కుబేరుడు ఉన్న దిశగా పరిగణిస్తారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే కుబేరుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. సంపద ప్రవాహానికి మార్గం తెరుస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగి పోతాయి. అంతే కాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది.