CM Revanth: అవినీతికి కేరాఫ్ గా మారిన ఆర్టీఏ చెక్ పోస్టులన్నీ మూసేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెండేళ్లలో అందుబాటులోకి ఉస్మానియా కొత్త బిల్డింగ్ వచ్చేలా కార్యాచరణ రెడీ చేయడం, తెలంగాణ పోలీసుల సంక్షేమంపై కొత్త నిర్ణయాలు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కొత్త సర్వేయర్లకు ట్రైనింగ్ పూర్తి, లైసెన్సులు అందించడం కీలకంగా మారుతున్నాయ్. ఆ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు మూసివేయాలనే ట్రాన్స్‌పోర్ట్ శాఖ ఈనెల 22న ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ ఆదేశాలతో రాష్ట్రంలో అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో అన్ని చెక్ పోస్టులు ఒక్కసారిగా మూతపడ్డాయి. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండొద్దని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలని ప్రభుత్వం సూచించింది. అన్ని రకాల రికార్డులను భద్రపరచాలని తెలిపింది. బిల్లులన్నీ ఆన్ లైన్ అవుతుండడంతో చెక్ పోస్టులు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా ఏసీబీ దాడుల్లో అవినీతి జరుగుతున్నట్లు తేలడం కూడా చెక్ పోస్టుల రద్దుకు మరో కారణం.
రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 22న ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం సమీక్షించారు. అవసరాలకు తగినట్లు ఆదునిక వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో వెంటనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉస్మానియా నూతన హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు.
తెలంగాణలో పోలీసు సంస్కరణలు, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈనెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్‌లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో సీఎం పాల్గొన్నారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులను పరామర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేశామన్నారు. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్‌గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలను, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు 2 కోట్ల రూపాయలకు పెంచుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. నిజామాబాద్ లో ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, 1 కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రా వేతనంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ సంక్షేమం నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పోలీస్ పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించామన్నారు.
రాష్ట్రంలోని అటవీ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లోని అదనపు కలెక్టర్లను సంబంధిత జిల్లాకు ఎక్స్-అఫీషియో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా నియమిస్తూ అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సర్వే, అటవీ సరిహద్దుల సెటిల్మెంట్లు పథకాన్ని రద్దు చేసిన తర్వాత.. ఈ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అయితే జాయింట్ కలెక్టర్ల పదవిని రద్దు చేయడంతో ఆ స్థానంలో అదనపు కలెక్టర్లు – రెవెన్యూ పదవిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మార్పుతో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ విధులను నిర్వహించడానికి కొత్త అధికారులను నియమించాల్సిన అవసరం ఏర్పడింది.
తెలంగాణలో రైతులకు భూసమస్యలు తొలగించేందుకు ప్రజాప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా.. వ్యవసాయ భూముల కొలతలు, సరిహద్దు వివాదాలకు చెక్ పెట్టేలా లైసెన్స్ డ్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్సులు అందించారు. రైతులకు అండగా ఉంటూ వారికి సంబంధించిన భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన బాధ్యత లైసెన్స్ పొందిన సర్వేయర్లపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. లైసెన్స్ పొందిన సర్వేయర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈనెల 19న లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం, మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన 1 కోటి 60 లక్షల ఎకరాల భూములు యజమానుల వద్ద ఉందని, 140 సంవత్సరాలుగా వివిధ చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ సమస్యలు ఇంకా పరిష్కారం లభించలేదన్నారు. సరిహద్దుల విషయంలో ఏ రైతు కూడా పరిష్కారం కాకుండా ఇబ్బంది పడొద్దని సర్వేయర్లను నియమించామన్నారు.
Story by Vidyasagar, Big tv