Tirumala Update : తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే నెల 10వ తేదీ నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆలయంలోని అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో నూతన పాలక మండలి ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విశేషమైన ఏకాదశి రోజుల్లో తిరుమలకు విచ్చేసే లక్షల మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కసరత్తులు చేస్తున్న పాలక మండలి.. ఇందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజుల్లో అత్యంత విశేషమైన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నారు. అయితే.. లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలుండడంతో.. కేవలం దర్శనం టికెట్లు ఉన్న వారికే అనుమతి ఇవ్వనున్నారు. భక్తులంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంది. అందులో.. దర్శన టోకెన్లు / టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించినా, దర్శనం చేసుకునే అవకాశం ఉండదని తెలిపారు. ఆ రోజుల్లో విపరీతమైన రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. అలానే.. సాధారణ రోజుల్లో తిరుమల శ్రీ వారిని దర్శించేందుకు వచ్చే భక్తుల్లో చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలకు అవకాశం ఉంది. కానీ.. వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఈ దర్శనాలకు బ్రేక్ పడనుంది. ఈ ప్రత్యేక పర్వదినం అయిపోయిన తర్వాత.. మళ్లీ తిరిగి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ ప్రకటించింది.
అన్ని ఆలయాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ.. కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు తప్పా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భారీ క్యూలైన్లు నివారించి.. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలానే.. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని స్పష్టం చేసింది. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని, లేని వాళ్లకు దర్శనం వీలు కాదని తెలిపింది.
భక్తులకు కేటాయించిన సమయం ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచించిన టీటీడీ.. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించడం లేదని వెల్లడించింది. 11 నుండి 19వ తేదీ వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తామని, కానీ.. ఏకదశి రోజున మాత్రం వీలు కాదని తెలిపింది.
Also Read : జీవితంలో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఆరు మంత్రాలు జపించండి
వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు ఈ రోజుల్లో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆయా రోజుల్లో వారి తాకిడిని తట్టుకునేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంటుంది. అయినా.. వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఇతరుల సేవల్ని టీటీడీ వినియోగించుకుంటోంది. అందులో భాగంగానే.. ఏకదశి రోజుల్లో 3 వేల మంది యువ శ్రీవారి సేవకులను వివిధ సేవల్లో వినియోగించుకోనుంది. వారితో పాటు అదనంగా యువ స్కౌట్స్ & గైడ్స్ ను నియమించుకుని వారిని క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.