దేవతలను, వారి శక్తులను, ఆశీర్వాదాలను నమ్మే కాలంలోనే మనం జీవిస్తున్నాము. పురాతన కాలం నుంచి దేవతలనుంచి రక్షణ పొందేందుకు కొన్ని రకాల ప్రార్థనలు, మంత్రాలు సహకరిస్తాయని ప్రజలు నమ్ముతారు. హిందూ మతంలో వేరువేరు మంత్రాలను జపిస్తారు. పూజలు చేస్తారు. ఆచారాలను పాటిస్తారు. అయితే మీ జీవితంలోకి క్లిష్టమైన దశ, కష్టమైన పరిస్థితులు నడుస్తున్నప్పుడు మీరు కొన్ని రకాల మంత్రాలను ప్రతిరోజూ జపించాల్సిన అవసరం ఉంది.
హనుమాన్ చాలీసా
హనుమంతుడికి అంకితం చేసిన అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాలు హనుమాన్ చాలీసాలో ఉన్నాయి. దీన్ని అవధి భాషలో గోస్వామి తులసీదాస్ రచించారు. ఇది హనుమంతుని బలాన్ని సద్గుణాలను చెబుతుంది. హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు మన ఒంట్లోకి శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు. ఆ వ్యక్తి బలంగా మారుతారని, హనుమంతుని రక్షణ దొరుకుతుందని చెబుతారు. కాబట్టి ప్రతిరోజు కనీసం రెండుసార్లు హనుమాన్ చాలీసా పఠించడానికి ప్రయత్నించండి. బ్రహ్మ ముహూర్తంలో ఒకసారి, సాయంత్రం హారతి సమయంలో ఒకసారి పఠిస్తే కష్టమైన పరిస్థితుల్లో మీకు రక్షణ దొరుకుతుంది.
కాలభైరవ అష్టకం
ఎవరైనా మీ పురోగతి, ఆరోగ్యం, ఆనందం పట్ల అసూయగా ఉంటే మీకు దేవతల రక్షణ ఎంతో అవసరం. ఆ చెడు శక్తి నుంచి మిమ్మల్ని కాపాడే సామర్థ్యం కాలభైరవునికే ఉంది. కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజూ పఠించేందుకు ప్రయత్నించండి. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది.
మహా మృత్యుంజయ మంత్రం
మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి మహా మృత్యుంజయ మంత్రం మంచి ఫలితాలను ఇస్తుంది. శివుని అత్యంత శక్తివంతమైన మంత్రాలలో మహా మృత్యుంజయ మంత్రం కూడా ఒకటి. ప్రతిరోజు దీన్ని 108 సార్లు జపించడం వల్ల మీకు ఎంతో శక్తి వస్తుంది.
పంచముఖి హనుమాన్ స్తోత్రాలు
పంచముఖి హనుమంతుడు ఆంజనేయుడికి మరో రూపం. హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడుని రక్షించేందుకు పంచముఖి రూపాన్ని ధరించాడని చెప్పుకుంటారు. కాబట్టి చెడు శక్తులు నుండి మిమ్మల్ని కాపాడడానికి పంచముఖి హనుమాన్ శ్లోకాలను జపించండి.
బజరంగ బాన్
ప్రతిరోజు బజరంగ బాన్ పఠించడం వల్ల హనుమంతుడి రక్ష దొరుకుతుందని చెబుతారు. బజరంగ్ బాన్ జపిస్తూ హనుమంతుడిని ప్రార్థించడం వల్ల మీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఎలాంటి శత్రుత్వాలు అయినా వదిలించుకోవచ్చు అని చెబుతారు.
కనకధారా స్తోత్రం
కనకధారా స్తోత్రాన్ని ఆదిశంకరాచార్య రచించారు. సంపద, డబ్బు, సమృద్ధికి అధిదేవత అయిన లక్ష్మి దేవిని కీర్తిస్తూ ఈ కనకధారా స్తోత్రాన్ని రాశారు. మీ ఇంట్లోని ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి అప్పుల బాధలను పోగొట్టుకోవడానికి ఈ కనకధారా స్తోత్రాన్నిపఠిస్తే మంచి ఫలితం ఉంటుంది.
గాయత్రీ మంత్రం
గాయత్రి మంత్రం పురాతన వేద శ్లోకం. మన మనసును శాంత పరచడానికి ఇది ఉపయోగపడుతుంది. గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అంతర్గత శాంతి కూడా పెరుగుతుంది.