Tirumala Dec 2024 Festivals: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా అంటూ తిరువీధులు శ్రీవారి నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఆ స్వామిని దర్శించిన భక్తులు పరవశించి గోవిందా నామస్మరణ చేస్తున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకు రాగా, తిరుమల భక్తజనసంద్రంతో నిండి పోయింది. స్వామి వారికి మొక్కుకున్న మొక్కులు చెల్లించి, తలచితి.. సొలసితి అంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు.
అయితే డిసెంబర్ నెల రానే వచ్చింది. ఈ నెలలో తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారా.. ఆ కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనభాగ్యం కోసం వెళుతున్నారా.. అయితే ఈ నెలలో తిరుమలలో పలు విశేష పర్వదినాలు ఉన్నాయి. ఆ పర్వదినాలలో శ్రీవారి దర్శనం చేసుకుంటే, స్వామి వారి అనుగ్రహంతో పాటు స్వామి కరుణకటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మరెందుకు ఆలస్యం ఈ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించండి.. ఆ స్వామి లీలలను స్వయంగా తరించండి.
నేడు శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం, 11న సర్వ ఏకాదశి, 12న చక్రతీర్థ ముక్కోటి, 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర, 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, 16న ధనుర్మాసారంభం, 26న సర్వ ఏకాదశి, 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ అధికారిక ప్రకటన చేసింది.
నవంబర్ 30వ తేదీన శ్రీవారిని 73619 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 25112 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 4 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.35 కోట్లు శ్రీవారికి ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వాదర్శనానికి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.