ప్రకాశం జిల్లా రాజకీయలలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఒంగోలుతో పాటుగా ప్రకాశం జిల్లాలో అన్నీ తానై వ్యవహరించిన మాజి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసిపికి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. ఎన్నికల ముందే బాలినేని సిఎం చంద్రబాబుతో సమావేశం అయినట్లు.. ఆ సమయం లోనే టీడీపీకి రావాలని.. అధికారంలోకి వచ్చిన తరువాత తగిన ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హమీ ఇచ్చారని ప్రచారం జరిగింది. తాజాగా బిగ్ టీవీ ఇంటర్యూలో టీడీపీలోకి వస్తే.. చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చెసినట్లు బాలినేని వెల్లడించారు . అప్పట్లో తనకు లక్ బాగా లేక టీడీపీలోకి వెళ్లలేదని పేర్కొన్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో ఒంగోలులో వైసిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బాలినేని ఒంగోలు ఎంపీతో పాటు దర్శి ఎమ్మెల్యే విషయంతో తాను సూచించిన వారికి సీట్లు ఇవ్వాలని పట్టు బట్టారు. కానీ, జగన్ అంగీకరించ లేదు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఈవీఎంల పైన బాలినేని కోర్టుకు ఎక్కారు. పార్టీ నుంచి మద్దతు లభించ లేదు. తరువాతి పరిణామాల్లో బాలినేని జనసేనలో చేరారు. జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో సత్సంబంధాలు ఉన్న బాలినేని జనసేనలో చేరే సమయంలోనే రాజకీయ భవిష్యత్ పైన హామీ పొందారంట.
ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారని సమాచారం. అయితే, బాలినేని జనసేనలో ఎంట్రీ సమయం నుంచి ఒంగోలు టీడీపీ నేతలు ఓపెన్ గానే విమ్శలు గుప్పిస్తున్నారు. బాలినేని జనసేన లో చేరినా.. వైసీపీఅధికారంలో ఉన్న సమయంలో చేసిన పనులకు సమాధానం ఇవ్వకుండా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. జనసేన లోని కొందరు నేతలు సైతం బాలినేనికి దూరంగా ఉంటున్నారు.
Also Read: నాదెళ్ల సీజ్ చేసిన బియ్యం పోర్ట్‌కి ఎలా వచ్చాయి..? కాకినాడా మాఫియాకు లీడర్ అతనే..!
ఇక వైసీపీ హయాంలో సెకీ ఒప్పందాలు, సోలార్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి జగన్‌పై ముప్పేట దాడి జరుగుతుంది. సెకీ ఒప్పందాలు జరిగినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యత్తు శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పటి జగన్ నిర్ణయాలపైన బాలినేని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ను ఇరకాటంలోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అసలు బాలినేని ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు. కేవలం వైసీపీని ఇరకాటంలో పెట్టి రివెంజ్ తీర్చుకోవడానికేనా.. లేక అంతకు మించిన వ్యవహారం ఇంకేదన్నా ఉందా అని ఆరా తీస్తున్న వాళ్ళకు కొత్త విషయం తెలుస్తోందట. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇప్పించాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోందని.. పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ కల్యాణ్, మరో ఇద్దరు మంత్రులు ఉన్నారు. కాపు, కమ్మ కాంబినేషన్ ఉన్నందున బాలినేనికి పదవి ఇప్పిస్తే.. రెడ్డి సామాజికవర్గంనికి జనసేన నుంచి అవకాశం కల్పించినట్లు అవుతుందన్నది జనసేనాని ఆలోచనట. బాలినేనికి ఇటు ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన గుంటురు, నెల్లూరులతో పాటు రాయలసీమలో మంచి రాజకీయ పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతో పార్టీని బలోపేతం చేసుకోవచ్చన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా చెప్తున్నారు.
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంది. కూటమి సర్కారు ఏర్పడి అయిదు నెలలు అవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పదవి ఖాళీగానే ఉంచారు. ఆన్ని బాలినేనితో భర్తీ చేయవచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణచక్రవర్తి, జయమంగళ వెంకట రమణ రాజీనామాలు చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇవాళ కాకుంటే రేపైనా వాటిని ఆమోదించక తప్పదని, ఆ తర్వాత కూటమి కోటాలోకి వచ్చే ఆ ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి బాలినేనికి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన పట్టు తగ్గకుండా, ఉనికి చాటుకునేందుకు బాలినేని వైసిపిపై, జగన్‌పై కాస్త ఘాటైన విమర్శలు చేస్తున్నారంట. కారణం ఏదైనా మాజీ మంత్రి కామెంట్స్ మాత్రం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. వైసీపీని ఇరకాటంలో పడేస్తున్నాయట. బాలినేనికి ఎమ్మెల్సీ ,మంత్రి పదవి దక్కుతే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవి దక్కిన వెంటనే పవన్ తో ఒంగోలు లో భారీ బహిరంగ సభను కూడా బాలినేని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారం ప్రచారం ప్రకాశంలో జోరందుకుంది. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఒంగోలు వరలో ఆ రెండు కత్తులు ఎలా ఇముడుతాయనేది ఆసక్తికరంగా మారింది.