Vasant Panchami 2026: మన సంస్కృతిలో వసంత పంచమికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది జనవరి 23న జరుపుకోనున్న ఈ పండగ, కేవలం ఒక ఋతువు మార్పు మాత్రమే కాదు. అది మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే పవిత్ర సమయం. మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి నాడు జరుపుకునే ఈ వేడుకను ‘జ్ఞానోత్సవం’ అని పిలుస్తారు.
ఋతురాజైన వసంతం – ప్రకృతి నవ చైతన్యం:
చలికాలపు జడత్వాన్ని వీడి ప్రకృతి తన కొత్త రూపాన్ని సంతరించుకునే సమయమిది. చెట్లు చిగురించడం, పూలు వికసించడం ద్వారా ప్రకృతిలో ఎలాగైతే నవ చైతన్యం వస్తుందో, అలాగే మనిషి మేధస్సులో కూడా కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరగడానికి ఈ వసంత కాలం ప్రేరణనిస్తుంది. అందుకే వసంతాన్ని ‘ఋతువుల రాజు’ అని పిలుస్తారు. ఈ సమయంలో వీచే గాలి, వాతావరణంలోని ఆహ్లాదం మానవ మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి.
వేదాలు,పురాణాలలో సరస్వతి ప్రాభవం:
ఋగ్వేద కాలం నుంచి సరస్వతి దేవిని అత్యంత పవిత్రంగా ఆరాధిస్తున్నారు. వేదాలలో ఆమెను కేవలం ఒక దేవతగా మాత్రమే కాకుండా.. ప్రాణ దాత అయిన నదిగా కూడా వర్ణించారు. “అంబితమే, నదీతమే, దేవితమే సరస్వతి” అనే మంత్రం ఆమె లోని మాతృత్వాన్ని, ప్రవాహ గుణాన్ని , దైవత్వాన్ని చాటి చెబుతుంది.
ఉప నిషత్తుల ప్రకారం.. సరస్వతి దేవి ‘బ్రహ్మవిద్య’కు ప్రతి రూపం. అంటే మనిషిని ప్రాపంచిక భ్రమల నుంచి విముక్తి చేసి, పరమాత్మ వైపు నడిపించే జ్ఞానం ఆమె ద్వారానే లభిస్తుంది. పురాణాల్లో ఆమెను సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవుని మానస పుత్రికగా, సకల సృష్టికి మూలమైన వాక్కుగా అభివర్ణించారు.
జ్ఞాన ప్రతీకలు: వీణ, హంస , పసుపు రంగు:
సరస్వతి దేవి ధరించే వస్త్రాలు, పట్టుకునే ఆయుధాలు అన్నీ ఒక్కో పరమార్థాన్ని కలిగి ఉంటాయి.
తెల్లని వస్త్రాలు: స్వచ్ఛతకు, నిష్కళంకమైన జ్ఞానానికి నిదర్శనం.
వీణ: శబ్దం, సంగీతం, కళలు భగవంతుడిని చేరుకోవడానికి మార్గాలని సూచిస్తుంది.
హంస: పాలను, నీటిని వేరుచేసే హంస గుణం.. సత్యాసత్యాలను వివేచించే బుద్ధిని కలిగి ఉండాలని బోధిస్తుంది.
Also Read: మాఘ గణేష్ జయంతి.. ఈ రోజు కూడా చంద్రుడిని చూడకూడదట !
పసుపు రంగు: వసంత పంచమి నాడు పసుపు రంగుకు విశేష ప్రాధాన్యం ఉంది. పసుపు రంగు శక్తికి, ఆశకు, మేధో వికాసానికి చిహ్నం. అందుకే ఈ రోజున పసుపు వస్త్రాలు ధరించడం, పసుపు రంగు పిండివంటలు నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తోంది.
విద్యారంభం, ఆధ్యాత్మిక అభ్యాసం:
వసంత పంచమి రోజున చిన్నారులకు ‘అక్షరాభ్యాసం’ చేయడం తర తరాలుగా వస్తున్న సంప్రదాయం. జ్ఞాన సముపార్జన ప్రారంభించడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు. కేవలం విద్యార్థులే కాకుండా..కళాకారులు, మేధావులు , ఆధ్యాత్మిక సాధకులు కూడా తమ సాధనను ఈ రోజున పునః ప్రారంభిస్తారు. అజ్ఞానం అనే చీకటి ని తొలగించి, చైతన్యం వైపు అడుగులు వేయడ మే ఈ పూజలోని అసలు ఉద్దేశ్యం.