Ganesh Jayanti 2026: వినాయక చవితిలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగ ‘మాఘ గణేష్ జయంతి’. 2026లో ఈ పండగ జనవరి 22వ తేదీన వచ్చింది. దీనినే మాఘ వినాయక చతుర్థి లేదా తిల్కుంద్ చతుర్థి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం జరుపుకొనే వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. కానీ శాస్త్రాల ప్రకారం వినాయకుడు జన్మించిన తిథి మాఘ శుద్ధ చతుర్థి. ఈ రోజున గణనాథుడిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగి, సర్వకార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
మాఘ గణేష్ జయంతి విశిష్టత:
ప్రతి ఏటా మాఘ మాసం శుక్ల పక్ష చతుర్థి రోజున గణేష్ జయంతిని జరుపుకుంటారు. పురాణాల ప్రకారం..పార్వతీ దేవి తన ఒంటి నలుగు పిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసిన రోజూ ఇదే.
ముహూర్తం, తిథి:
తేదీ: 22 జనవరి (గురువారం).
చతుర్థి తిథి ప్రారంభం: జనవరి 22 తెల్లవారుజామున 02:47 గంటలకు.
చతుర్థి తిథి ముగింపు: జనవరి 23 తెల్లవారుజామున 02:28 గంటలకు
పూజా సమయం: ఉదయం 11:29 నుంచి మధ్యాహ్నం 01:37 వరకు అత్యంత శుభప్రదమైన సమయం.
పూజా విధానం :
మాఘ గణేష్ జయంతి రోజున భక్తులు తెల్లవారుజామునే లేచి.. పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. పూజలో ప్రధానంగా పాటించాల్సిన నియమాలు ఇవే..
గణపతి ప్రతిష్ట: శుభ్రం చేసిన పూజా మందిరంలో వినాయక విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచి, ఎర్రటి వస్త్రంతో అలంకరించాలి.
పత్రం. పుష్పం: వినాయకుడికి ఇష్టమైన గరిక, ఎర్రటి మందార పూలతో పూజించాలి. 21 గరిక పోచలను సమర్పించడం విశేషం.
నైవేద్యం: ఈ పండుగకు ‘నువ్వుల’ ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే దీనిని తిల్కుంద్ చతుర్థి అంటారు. నువ్వులతో చేసిన ఉండ్రాళ్లు, మోదకాలు, బెల్లం నైవేద్యంగా పెట్టాలి.
చంద్ర దర్శనం నిషిద్ధం: వినాయక చవితి లాగే ఈ రోజున కూడా చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ పొరపాటున చూస్తే ‘శ్యమంతక మణి’ కథను చెప్పుకోవడం లేదా వినాయక వ్రత కథ చదవడం ద్వారా దోష నివారణ జరుగుతుంది.
గౌరీ గణేష్ చతుర్థి – వ్యత్యాసం:
చాలామంది భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితిని, ఈ మాఘ జయంతిని ఒకేలా భావిస్తారు. కానీ చిన్న వ్యత్యాసం ఉంది.
భాద్రపద చతుర్థి: ఇది వినాయకుడు భూలోకానికి వచ్చి తన భక్తులతో గడిపే సమయంగా పరిగణించబడుతుంది. దీనిని ‘వినాయక చవితి’గా పెద్ద ఎత్తున వేడుక చేస్తారు.
మాఘ చతుర్థి: ఇది వినాయకుడి అవతార దినం (జన్మదినం). ఆధ్యాత్మికంగా శక్తిని పొందేందుకు, అంతర్గత అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ రోజున చేసే జపం, తపం అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.
Also Read: ఈ ఏడాది రథ సప్తమి ఎప్పుడు ? పూజా విధానం, పూర్తి వివరాలు
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
మాఘ మాసంలో సూర్యరశ్మి తీక్షణత పెరుగుతుంది. ఇది జ్ఞానానికి సంకేతం. వినాయకుడు బుద్ధికి, జ్ఞానానికి అధిపతి. కాబట్టి విద్యార్థులు, కొత్త పనులు ప్రారంభించేవారు ఈ రోజున గణపతిని దర్శించుకోవడం వల్ల ఏకాగ్రత , విజయం లభిస్తాయి. ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.