శ్రావణ మాసంలో శివాలయాన్ని భక్తులతో నిండిపోయి ఉంటాయి. ప్రతి సోమవారం శివ పూజలతో, శివాభిషేకాలతో భక్తులు తనివి తీరా ఆ ముక్కంటిని పూజిస్తారు. అలాగే ఈ సమయంలోనే తీర్థయాత్రలు చేసేవారు ఎక్కువమంది. ప్రముఖ శివాలయాలను దర్శించుకుంటారు. మనదేశంలో ఉన్నా శివాలయాలలో కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. దీన్ని కోటి శివలింగాల అని కూడా అంటారు. ఈ కోటి లింగేశ్వర ఆలయంలో అన్ని శివలింగాలు కలిపి కోటి వరకు ఉంటాయని చెప్పుకుంటారు.
కోటిలింగేశ్వర ఆలయంలో ఒక పెద్ద శివలింగం, నంది ఉంటాయి. వాటి చుట్టూ లక్షలాది శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఆ ప్రాంతమంతా శివలింగాలతో నిండిపోయి కనులు పండుగ ఉంటుంది.
కోటిలింగేశ్వర ఆలయం ఎక్కడ?
ఈ కోటిలింగేశ్వర ఆలయానికి వెళ్లాలంటే కర్ణాటకలోని కోలార్ జిల్లాకు వెళ్లాలి. అక్కడి నుంచి కమ్మసంద్ర గ్రామంలో ఈ కోటిలింగేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తూనే ఉంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆనందం వెల్లివిరుస్తుందని నమ్ముతారు. కోరిక నెరవేరిన తర్వాత ప్రజలు తమ శక్తి మేరకు ఒకటి నుండి మూడు అడుగుల శివలింగాన్ని ప్రతిష్టిస్తారు. ఇలా ఎంతోమంది భక్తుల ప్రతిష్టించిన శివలింగాలు అక్కడ లక్షలాది వరకు ఉన్నాయి.
కోటిలింగేశ్వర ఆలయంలో 108 అడుగుల ఎత్తుగలు ఒక భారీ శివలింగం కూడా ఉంది. ఈ శివలింగం ముందే 35 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో 11 ఆలయాలు కూడా ఉంటాయి. ఈ ఆలయాలలో అనేక దేవుళ్ళు ఉంటారు. ఈ భారీ శివలింగం ముందు నిల్చని చూస్తే ఆ మహా దేవుడిని చూసినంత అనుభూతి కలుగుతుంది.
చెట్టుకు దారం కడితే
ఆలయంలో కొంతమంది భక్తులు పసుపు దారాన్ని కట్టి వెళతారు. కోటిలింగేశ్వర ఆలయ సముదాయంలో రెండు పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్లకు పసుపు దారం కట్టి కోరికను చెబితే అవి నెరవేరుతాయి అని నమ్ముతారు. ముఖ్యంగా వివాహాలలో ఉన్న అడ్డంకులను తొలగించే శక్తి ఈ చెట్టుకు ఉందని చెబుతారు. కట్టిన వారికి వివాహం త్వరగా అవుతుందని ఒక నమ్మకం.