ఆధునిక జీవనశైలి వల్ల జీవితం ఎంతో మారిపోయింది. సాంకేతికత ఆధారిత ఉద్యోగాలు మన జీవితాలను సులభతరంగా మార్చేశాయి. కానీ శారీరక కష్టాన్ని తగ్గించేసాయి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. భారతదేశంలో ఐటీ రంగం విపరీతంగా అభివృద్ధి సాధించాక… ఎంతో మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 10 గంటలు కూర్చునే పనిచేస్తున్నారు. దీనివల్ల వారి జీవన శైలి చాలా నిశ్చలంగా మారిపోయింది. వారికి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరిగిపోయింది.
నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ చెబుతున్న ప్రకారం హైదరాబాదులోని 84 శాతం ఐటీ ఉద్యోగులు కొవ్వు కాలేయ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. కేవలం వారి ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలే దీనికి కారణం అని కొత్త అధ్యయనం చెబుతోంది.
ఫ్యాటీ లివర్ సమస్య అంటే..
మన కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కాలేయాన్ని బలహీనపరుస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే అది కాలేయ క్యాన్సర్ గా లేదా కాలేయ సిర్రోసిస్ వంటి విపరీతమైన అనారోగ్యాలకు కారణం అవుతుంది.
అధ్యయనం ఏమి వివరించింది?
తాజాగా చేసిన అధ్యయనంలో ఫ్యాటీ లివర్ కు సంబంధించి ఎన్నో నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే కాలేయ సమస్యలు తిరుగుతున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. అలాగే ప్యాక్ చేసిన ఆహారాన్ని కూడా అధికంగా తినేవారిలో ఇలా కాలేయ సమస్యలు వస్తున్నాయి. ఐటీ రంగంలో అర్ధరాత్రి వరకు పని చేయడం అలవాటుగా మారింది. అలాంటప్పుడు ఉద్యోగులంతా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ప్యాక్ చేసిన ఆహారాలని ఆర్డర్లో పెట్టుకుంటున్నారు. ఇది కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే గంటలు తరబడి కుర్చీల్లో కూర్చొని ఉండడంవల్ల కొవ్వు కూడా పెరిగిపోతుంది. ఆ కొవ్వు కాలేయంలో పేరుకుపోయి ఆ అవయవాన్ని దెబ్బతీస్తోంది. ఒత్తిడి కూడా దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల కాలేయం బలహీన పడుతున్నట్టు అధ్యయనం చెబుతోంది కొంతమంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆల్కహాలు, సిగరెట్టు, మాదకద్రవ్యాలను అలవాటు చేసుకుంటారు. ఇది కాలేయానికి మరింత ప్రమాదకరమైనదిగా అధ్యయనం వివరిస్తుంది.
ఫ్యాటీ లివర్ లక్షణాలను మొదట్లో గుర్తించడం కష్టమే. కానీ ఆ వ్యాధి పెరిగే కొద్దీ శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఏ పని చేయకపోయినా తీవ్రంగా అలసిపోవడం, పొట్టపై భాగంలో బరువుగా లేదా నొప్పిగా అనిపించడం, ఆకలి వేయకపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారడం, పాదాలలో వాపు లేదా చర్మంపై దురద వంటివన్నీ ఫ్యాటీ లివర్ ను సూచిస్తాయి. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడు వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవడం ఉత్తమం.
చికిత్స కన్నా నివారణ ముఖ్యమని చెబుతారు. కాబట్టి వ్యాధి వచ్చే వరకు ఆగే కన్నా రాకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముందుగా మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు మీ మెనూలో చేర్చుకోండి. అలాగే నూనె తక్కువగా ఉండే ఆహారాలను తినండి. వేయించిన పదార్థాలు తీపి అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.