The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం ది రాజా సాబ్(The Raja Saab) సినిమాతో పాటు, హను రాగవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని పనులు పూర్తికాని నేపథ్యంలో జనవరి 9 2026న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి కావడంతో విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమా జనవరి 9న కూడా విడుదలకు నోచుకోలేదని వాయిదా పడుతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై చిత్ర బృందం స్పందిస్తూ జనవరి 9వ తేదీ సంక్రాంతి సందడిని రెట్టింపు చేయడానికి రాజా సాబ్ రాబోతున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేయాల్సిన ఫస్ట్ సింగిల్ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటను ఈ నెల మూడవ వారంలో విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఏకంగా గ్లోబల్ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయని మూడవ వారం ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా తదుపరి 10 రోజులకు ఒకసారి ఈ సినిమా నుంచి అప్డేట్ విడుదల చేసేలా చిత్ర బృందం ప్రణాళికలను రచించినట్టు తెలుస్తుంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక జనవరి ఒకటవ తేదీ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం బిజీగా ఉండటమే కాకుండా వరుస అప్డేట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ హీరో సంజయ్ దత్..
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన ఈ సినిమా కామెడీ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రభాస్ కు తాతయ్య పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ప్రభాస్ కి జోడిగా ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా సందడి చేయబోతున్నారు.