Hair Growth Temple: వయసుతో సంబంధం లేకుండా వందలో 90 శాతం మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య హెయిర్ ఫాల్. ముఖ్యంగా నేటి Gen Z యుగంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి జుట్టు రాలుతూనే ఉంటుంది. పురుషుల్లో ఈ సమస్య ఎక్కువ ఉండటంతో.. చిన్న వయసులోనే బట్టతల బారీన పడుతున్న వాళ్లు ఎందరో. రకరకాల ఇంటి చిట్కాలతో పాటు వైద్యుల సలహా మేరకు తీసుకున్న మందులు కూడా కొన్నిసార్లు పని చేయకుండా తీవ్ర నిరాశకు గురవుతుంటారు మగజాతి ఆణిముత్యాలు.
ఈ నేపథ్యంలో బట్టతల సమస్యను పరిష్కరించుకోవాలన్నా, ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా, మరింత ఒత్తుగా జుట్టు పెరగాలన్నా జపాన్‌లోని ఓ ఆలయానికి వెళ్లి మీ జుట్టులో కొంత భాగాన్ని త్యాగం చేస్తే చాలు. అవునండి.. మీరు విన్నది నిజమే. జుట్టు పెరుగుదల కోసం ఆలయానికి వెళ్లడం ఏంటనే కదా మీ సందేహం? బట్టతలతో ఇబ్బంది పడుతున్న మగాళ్లతో పాటు మహిళలు కూడా ఈ ఆలయానికి వెళ్లి తమ మొక్కులను చెల్లించుకుని.. తమ కోరిక మేరకే మళ్లీ జుట్టును పొందుతున్నారు. రండి.. ఆ ఆలయం ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏమిటి.. వంటి వివరాలను తెలుసుకుందాం.
జుట్టు పెరగడానికి ఆలయానికి వెళ్లి పూజలు చేయడం అనేది కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం అంటున్నారు స్థానికులు. జపాన్‌లోని క్యోటో నగరంలో ‘మికామి’ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఈ ఆలయం జుట్టు కోసం అంకితం చేయబడిన ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. జుట్టు పెరుగుదల, ఆరోగ్యం, బట్టతల సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటున్న వాళ్లంతా.. ఈ మికామి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
సంవత్సరం పొడవునా వేలాది మంది పర్యాటకులు తమ జుట్టు బాగుండాలని కోరుకుంటూ ఈ క్ష్రేత్రానికి వస్తుంటారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం స్థానికులు, సాధారణ ప్రజలే కాదు.. శిక్షణ పొందిన బ్యూటీషియన్లు, హెయిర్ స్టైలిస్టులుగా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న యువత సైతం తమ రంగంలో రాణించాలని మికామి ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
ఈ పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన దేవుడి పేరు మసాయుకి ఫుజివారా. ఈ ఆలయం మాదిరిగానే ఇక్కడ ప్రార్థన చేసే విధానం కూడా చాలా డిఫ్రెంట్‌గా ఉంటుంది. ముందుగా భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రార్థన కవర్‌ను కొనాలి. ఆ తర్వాత గుడిలోని పూజారులు భక్తుల జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి కవర్లో వేస్తారు. అనంతర భక్తులు ఆ జుట్టు ఉన్న కవర్‌ను దేవుడి పాదాల వద్ద ఉంచి ప్రార్థించి, మళ్లీ దానిని పూజారికి అప్పగిస్తారు. ఈ విధానంలో మొక్కు చెల్లించుకోవడం వలన లైఫ్‌లో హెయిర్ ఫాల్ సమస్యలు దరిచేరవని, ఉన్న జుట్టు మరింత దృఢంగా ఉంటుందని భక్తుల నమ్మకం.
జపాన్‌లోని క్యోటా నగరంలో ఉన్న ఈ మికామి ఆలయనికి తొలి క్షౌరశాలగానూ పేరు. దీని వెనుక ఓ గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి కథ దాగి ఉందని గుడి పూజారులు చెబుతున్నారు. ఫుజివారా ఉనెమెనోసుకే మసాయుకి అనే క్షరకుడు తన వృత్తిని దైవంగా భావించేవారు. అతనిను జుట్టు కత్తిరించడం, స్టైలింగ్ చేయడం ద్వారా తన వృత్తికి పునాది వేశాడు. దీంతో అతన్ని ప్రజలంతా దైవంగా భావించి ఈ ఆలయాన్ని నిర్మించారట.
ఫుజివారా ఉనెమెనోసుకే మసాయుకి మరణాంతరం.. ప్రతినెలా 17న జపాన్ దేశమంతటా సెలూన్లను మూసివేసి ఆ తొలి క్షరకుడికి నివాళులర్పిస్తారు. అయితే మికామి దేవాలయానికి వచ్చిన భక్తులకు తమ జుట్టు సమస్యలు తగ్గడం వల్ల ఈ క్షేత్రానికి మరింత ఆదరణ పెరిగింది. నేటి కంప్యూటర్ యుగంలోనూ జుట్టు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఇలాంటి పురాతన విశ్వాసాలను గౌరవించే వారి సంఖ్య నేటికీ తగ్గడం లేదు.