Pushpa 2 Tragic Stampede: అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, సుకుమార్(Sukumar )దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప -2 (Pushpa-2). యావత్ దేశ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన విడుదలయ్యింది. కానీ బెనిఫిట్ షోలు డిసెంబర్ 4 అర్థరాత్రి నుండే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బెనిఫిట్ షోలలో చోటు చేసుకున్న విషాద ఘటన కారణంగా తాజాగా పుష్ప -2 సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని(Ramarao immineni) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు.
పుష్ప -2 పై మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు..
సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు సరైన రీతిలో స్పందించలేదు అని, ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ పై లాఠీ చార్జి చేయడం, ముందస్తు జాగ్రత్తలేమి తీసుకోకపోవడం వల్లే మహిళ మృతి చెందినట్లు ఆయన తన పిటీషన్ లో తెలిపారు. ముఖ్యంగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పిటీషన్ ను స్వీకరించిన మానవ హక్కుల కమిషన్..
దీనిపై పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ దీనిపై దర్యాప్తు జరపనున్నట్లు తెలిసింది. ఇక దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తెలియనంది.
సంధ్య థియేటర్లో విషాద ఘటన..
అభిమాన హీరో సినిమా చూడడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని సంధ్య థియేటర్ కి తరలివచ్చారు. అయితే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో థియేటర్ కి అల్లు అర్జున్ కూడా రావడం గమనించిన అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది.వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి పబ్లిక్ ఫిగర్స్ బయటకు వచ్చినప్పుడు భద్రతా బలగాల మధ్య బయటకి రావాల్సి ఉంటుంది. కానీ వీరు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆడియన్స్ ముందుకు రావడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. ఇక దాంతో ఆడియన్స్ పై లాఠీచార్జి నిర్వహించారు. ఇక దాని నుంచి తప్పించుకోవడానికి ఆడియన్స్ పరుగులు పెట్టారట. అలా తొక్కిసలాట జరిగగా.. ఆ సందర్భంలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అంతేకాదు ఆమె కొడుకు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపై బెనిఫిట్ షోలు రద్దు..
ఈ విషయం తెలిసి పలువురు రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అల్లు అర్జున్ ఆ సమయంలో అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు వేయకుండా తెలంగాణ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏది ఏమైనా ఒక చిన్న పొరపాటు కారణంగా అటు నిర్మాతలకు ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పవచ్చు.