CM Revanth Reddy: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 24 అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వర్షాన్ని లెక్క చేయకుండా సభ నిర్వహించిన సినీ కార్మిక నేతలను సీఎం అభినందించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ కు సినీ పరిశ్రమను తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.
చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం కృషి చేస్తామని, ఈ మేరకే దిల్ రాజు చైర్మన్ గా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ‘‘సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. చిత్రపురి కాలనీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపు వెనక కార్మికుల శ్రమ ఉంది. కార్మికులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే నా ఆలోచన. కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్ తీసుకొస్తాం. ఫ్యూచర్ సిటీలో సినీ ఇండస్ట్రీకి స్థలాలు కేటాయిస్తాం. మేం వచ్చాకే గద్దర్ పేరుతో అవార్డులిచ్చే కార్యక్రమం చేపట్టాం.’’ అని అన్నారు.
సినిమా టికెట్ రేట్ల పెంపు అంశంపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. టికెట్ల ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం కేవలం నిర్మాతలు, అగ్ర హీరోలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తోందని, తెర వెనుక కష్టపడే కార్మికులకు మాత్రం ఎలాంటి లాభం చేకూరడం లేదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఇందుకు అనుగుణంగా ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) కూడా జారీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.
తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు సీఎం. ‘‘ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. తెలంగాణరైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూడండి. నర్సరీ నుంచి 12 గా తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీ ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తాం. సినీ కార్మికుల సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తాం’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.