Fake Doctors Arrest | గుజరాత్‌లో నకిలీ డిగ్రీల దందా యధేచ్ఛగా నడుస్తోంది. ఆ రాష్ట్రంలో కేవలం 8వ తరగతి చదివిన వారు మెడికల్ డిగ్రీలు పొందుతున్నారు. ఒక్క వైద్య డిగ్రీ ధర చాలా చీప్‌గా రూ.70,000 మాత్రమే. పోలీసులు ఇటీవల గుజరాత్ లోని సూరత్ నగరంలో ఒక క్రిమినల్ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకుంది. ఈ గ్యాంగ్ ఇప్పటివరకు 1200 నకిలీ డిగ్రీలు జారీ చేసిందని పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి నకిలీ డాక్టర్ డిగ్రీలు కొనుగోలు చేసిన 14 మంది నకిలీ డాక్టర్లను అరెస్టు చేశామని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ నకిలీ డిగ్రీల గ్యాంగ్ మాస్టర్‌మైండ్ ఒక నిజమైన డాక్టర్ అనేది షాకింగ్ విషయం. అతని పేరు డాక్టర్ రమేష్ గుజరాతి.
ఈ గ్యాంగ్ కంప్యూటర్ డేటాబేస్‌లో 1200 నకిలీ డిగ్రీలున్నాయని.. ఇవ్వన్నీ గుజరాత్ బోర్డ్ ఆఫ్ ఎలెక్ట్రో హోమియోపతి మెడిసిన్ (BEHM) ద్వారా జారీ చేయబడనవిగా ఈ క్రిమినల్ గ్యాంగ్ విక్రయిస్తోంది. వీటితో పాటు వందలాది అప్లికేషన్లు, సర్టిఫికేట్స్, స్టాంప్స్ వారి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: 3 నెలల్లో 35 లక్షలు సంపాదించిన పెళ్లికూతరు.. ఏజెన్సీతో కలిసి మోసం చేయడమే పని
గ్యాంగ్ గుట్టు రట్టు ఇలా..
సూరత్ నగరంలో ముగ్గురు డాక్టర్లు నకిలీ డిగ్రీలో అల్లోపతి క్లినిక్‌లు నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పోలీసులు ఆ మూడు క్లినక్‌లలో తనిఖీలు చేపట్టారు. ఆ క్లినిక్‌లలో డాక్టర్లు BEHM (హోమియోపతి) డిగ్రీలు చూపించారు. కానీ గుజరాత్ ప్రభుత్వం అసలు హోమియోపతి డిగ్రీలు జారీ చేయదని పోలీసులు ధృవీకరించుకొని.. ఆ డాక్టర్లను అరెస్టు చేశారు. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లు అయింది. ఈ డిగ్రీలన్నీ నకిలీ వెబ్ సైట్ పై నిందితులు రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ హోమియోపతి బోర్డు
ఇండియాలో అసలు లేని హోమియోపతి బోర్డుని క్రిమినల్ మాస్టార్ మైండ్ డాక్టర్ రమేష్ గుజరాతి సృష్టించాడు. భారతదేశంలో ఎలెక్ట్రో హోమియోపతికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో దీన్ని అవకాశంగా తీసుకొని నిందితుడు డాక్టర్ రమేష్ గుజరాతి.. సొంతంగా ఆన్ లైన్‌లో బోర్డు పెట్టేసి వైద్య డిగ్రీలు విక్రయించడం చేస్తున్నాడు.
నకిలీ హోమియోపతి కోర్సు
నిందితుడు డాక్టర్ రమేష్ గుజరాతి ముందుగా అయిదుగురుకి హోమియోపతిలో కొంత శిక్షణ ఇచ్చి వారికి ఎలెక్ట్రో హోమియోపతి బోర్డు ద్వారా డిగ్రీలు ఇప్పించాడు. దీంతో వీరంతా నగరంలో క్లినిక్‌లు పెట్టి ప్రజలకు హోమియోపతి చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. కానీ ప్రజలు హోమియోపతి వైద్యం పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఈ నకిలీ డాక్టర్లు అల్లోపతి మందులు ఇస్తున్నట్లు తెలిసింది. హోమియోపతి డిగ్రీలు అమ్ముడుకాకపోవడంతో డాక్టర్ రమేష్ గుజరాతి కూడా గుజరాత్ ఆయుష్ మినిస్ట్రీతో BEHM ఒప్పందం చేసుకుందని తెలిపి నకిలీ డాక్టర్లకు ఆయుష్ విభాగం పేరుతో డిగ్రీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. దీని కోసం ఒక్కో డిగ్రీకి రూ.70,000 తీసుకుంటూ ఇక వారంతా అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద పద్ధతుల్లో చికిత్స అందించవచ్చని చెప్పాడు.
డబ్బులు చెల్లించిన 15 రోజుల్లో డిగ్రీ ఇచ్చేవాడు. పైగా సంవత్సరానికి ఒకసారి డిగ్రీ రెనెవల్ కోసం రూ.5000 నుంచి రూ.15000 వరకు తీసుకునేవాడని పోలీసులు వెల్లడించారు. రెనెవల్ చేసుకోని డాక్టర్లను ఈ గ్యాంగ్ బెదిరించేదని.. గ్యాంగ్ ఆర్థిక లావాదేవీలు చేసేందుకు శోభిత్, ఇర్ఫాన్ అనే ఇద్దరినీ అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.