Lucifer 2: Empuran..ప్రముఖ మాలీవుడ్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లూసీఫర్'(Lucifer ) ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తెలుగులో చిరంజీవి (Chiranjeevi ) గాడ్ ఫాదర్ పేరిట రిలీజ్ చేయగా.. ఈ సినిమా ఇక్కడ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ముఖ్యంగా గాడ్ ఫాదర్ ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అంచనాలు తలకిందులయ్యాయి. క్యారెక్టర్ లను మార్చేయడం వల్ల సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదని, ఇటీవల మోహన్ లాల్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందించిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్ చేయాలని ఆలోచన మోహన్ లాల్ దేనని, ఈ సినిమాకు సీక్వెల్ చేయాలి అని పట్టుబట్టారు అంటూ ఇటీవల డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తెలిపిన విషయం తెలిసిందే.అందులో భాగంగానే మోహన్ లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో శ్రమించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం లూసిఫర్ 2: ఎంపురాన్.
సుకుమారన్ పై ఒత్తిడి తెచ్చిన నిర్మాత..
భారీ అంచనాల మధ్య హై ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. విడుదలైన రెండు రోజుల్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకొని, రూ.100 కోట్ల క్లబ్లో చేరడంతో సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో వాటిని మార్చనున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. లూసిఫర్ 2:ఎంపురాన్ సినిమా ఒక నిర్దిష్ట వర్గం ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసింది అని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమాలో మార్పులు చేయమని డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పై నిర్మాత గోకులం గోపాలం ఒత్తిడి తీసుకొచ్చారట.
రాజకీయాలను సేవగా మాత్రమే చూస్తాం – నిర్మాత
ఇదే విషయంపై నిర్మాత మాట్లాడుతూ.. సినిమాలో చూపించిన సన్నివేశాలు కొంతమందిని బాధపెట్టినట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే మార్పులు చేయమని డైరెక్టర్ తో చెప్పాను. ముఖ్యంగా కొన్ని పదాలను ప్రస్తుతానికి మ్యూట్ చేశాము. సినిమాలో చూపించిన కొన్ని విషయాలకు నిరసనలు వచ్చాయి. ముఖ్యంగా ఆ మార్పులపై సెన్సార్ కూడా ఏమీ చెప్పలేదు. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నేను రాజకీయాలను ఒక సేవగా మాత్రమే చూస్తాను” అంటూ నిర్మాత తెలిపారు.
L2: ఎంపురాన్ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరాలు..
ఇకపోతే ఈ సినిమా పరోక్షంగా గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సంఘటనలను ఉద్దేశించి చిత్రీకరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సుకుమారన్ పోషించిన పాత్ర ఈ నేపథ్యం పైనే సాగుతుంది. ఈ సినిమా అధికార పార్టీ కేంద్ర సంస్థల దుర్వినియోగాన్ని కూడా విమర్శనాత్మకంగా రూపొందించబడిందని, కేరళను విభజించి దాని వ్యూహాత్మక తీర ప్రాంతం అలాగే ఓడరేవులపై నియంత్రణ సాధించాలని “సంగ్ ఎజెండా”ను ఈ చిత్రం బహిర్గతం చేస్తోందని, కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పేర్కొన్న విషయం తెలిసింది.
ప్రేక్షకుడికి ఆ స్వేచ్ఛ ఉంది – కేరళ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.సురేష్
దీనిపై కేరళ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. “ఎంపురాన్ చిత్రం రాజకీయ సమస్య కాదు.. బిజెపి ఇందులో జోక్యం చేసుకోదు. సినిమా ప్రేమికులకు సినిమా చూడడానికి, దానిని సమర్థించడానికి, విమర్శించడానికి కూడా స్వేచ్ఛ ఉంది” అంటూ ఆయన తెలిపారు.
మార్పులు చేయాలి అంటే రూ.40 లక్షలు ఖర్చు – నిర్మాత
ఇక దీన్ని అందుకున్న నిర్మాత మాట్లాడుతూ.. మేము ఎవరిని బాధ పెట్టడానికి సినిమాలు తీయలేదు. ప్రేక్షకులు సంతోషంగా ఉండాలని మాత్రమే మేము కోరుకున్నాము. ఈ సినిమా మొత్తం 4000 థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. ఇక ఈ మార్పుల వల్ల టీం కి భారీ మొత్తం ఖర్చవుతుంది. ముఖ్యంగా మార్పులు చేసేటప్పుడు వారు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటారో తెలియదు. ఒక నిర్దిష్ట థియేటర్లో మార్చాలి అంటే ఎంతో ఖర్చవుతుంది. కాబట్టి ఈ మార్పులు చేయడానికి సుమారుగా రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేను అంచనా వేశాను” అంటూ కూడా నిర్మాత తెలిపారు.