Ugadi Pachadi Shadruchulu: ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటో తెలుసా..? అందులోని షడ్రుచుల సమ్మేళనం దేనికి సంకేతమో తెలుసా..? ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు కలపడంలో ఉన్న అంతర్యం ఏంటో తెలుసా..? ఉగాది పండుగ నాడే పచ్చడి ఎందుకు చేసుకుంటారో తెలుసా..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలో ఎంటర్ అవ్వాల్సిందే..!
తెలుగు సంవత్సరాది యుగాది. దీన్నే అందరూ ఉగాది పండుగగా జరుపుకుంటారు. తెలుగునాట ఉగాది పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు వారి నూతన సంవత్సరం ఈ ఉగాది నుంచే ప్రారంభం అవుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిని అంత్యంత వైభోవోపేతంగా జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. అయితే ఇదే కాకుండా ఉగాదికి మరిన్ని బాష్యాలు చెప్తుంటారు పండితులు.
తెలుగు నెలల ప్రకారం వసంత మాసంలో వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఉగాదిని జరుపుకుంటారు. అయితే ఉగాది పండుగకు.. ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉందంటున్నారు పండితులు. పురాణాల ప్రకారం ఈ రోజే ఉగాది పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఉందంటున్నారు. చైత్ర శుక్ల పాడ్యమి నాడే సృష్టి అవిర్బావం జరిగిందని అందుకే ఉగాది పండుగను కూడా ఇదే జరుపుకుంటారని చెప్తున్నారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈరోజే సృష్టికి ప్రాణం పోశాడని.. ప్రభవ నామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలైందని.. అది నేటికి కొనసాగుతుందని.. అదే విషయం వేదాలలో ఉందంటున్నారు పండితులు. అయితే ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు.. బ్రహ్మ కల్పం పూర్తి చేశారని.. ప్రస్తుతం ఏడో బ్రహ్మ తన బ్రహ్మకల్పాన్ని కొనసాగిస్తున్నాడని చెప్తున్నారు.
అలాగే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడనే రాక్షసుణ్ని చంపేసి అతను ఎత్తుకెళ్తున్న వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు. ఇక శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు తమ రాజ్య పాలకులుగా బాధ్యతలు తీసుకున్నది కూడా ఉగాది నాడే అని చెప్తారు. భారతీయ జ్యోతిష్యుడైన వరాహమిహిరుడు పంచాంగాన్ని రచించి జాతికి అంకితం చేసింది కూడా ఉగాది నాడేనట. అందుకే ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం అనవాయితీగా వస్తుందంటున్నారు పండితులు.
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీకగా బావిస్తారు. ఉగాది పచ్చడిలో వేసే ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక అంటారు. అందులో వేసే బెల్లం ఆనందానికి, సంతోషానికి ప్రతీక అంటారు. అలాగే ఉప్పు మనిషి జీవితంలో ఉత్సాహానికి నిదర్శనంగా చెప్తారు. ఇక వేప పువ్వు.. బాధలకు గుర్తుగా చెప్పుకుంటారు. ఎన్ని బాధలున్నా వేప పువ్వు లాగా సంతోషంగా ఉండాలని సూచిస్తారు. చింతపండు జీవితంలో వచ్చే ఎటువంటి పరిస్థితులకైనా నేర్పుగా వ్యవహరించడానికి గుర్తుగా చెప్తారు. మామిడి ముక్కల వగరు జీవితంలో వచ్చే కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండటానికి గుర్తుగా చెప్తారు. ఇక ఆఖరిదైన కారం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనిషి సహనం కోల్పోకూడదని చెప్పడానికి సంకేతంగా సూచిస్తారు.
ఉగాది పండుగ వసంత రుతువులో వచ్చే పండుగ. ప్రకృతితో సమ్మిళితమైన పండుగ. కాబట్టి ఆ రోజు ఉగాది పచ్చడితో అందరూ పండుగ జరుపుకుంటారు. ఇక చైతన్య నవరాత్రులు ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి. రైతులు కొత్త పంటలను వేసి, కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్