Attack on Britain Prince : బ్రిటన్ రాజు ఛార్లెస్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఛార్లెస్ దంపతులపై ఓ వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసే రాజు ఛార్లెస్.. ఈసారి మాత్రం అలాగే చూస్తూ ఉండిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరంలో జరిగిన ఓ సంప్రదాయ వేడుకలో ఛార్లెస్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన పౌరులతో కరచాలనం చేస్తూ, వారిని పలుకరిస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛార్లెస్‌పై గుడ్లు విసిరాడు. ఊహించని పరిణామంతో దంపతులిద్దరూ కొద్దిసేపు అక్కడే నిలబడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించింది. అనంతరం బ్రిటన్ నూతన రాజుగా ఛార్లెస్ బాధ్యతలు చేపట్టారు. రాజు హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఛార్లెస్‌కు ఇంగ్లాండ్‌లో ఇలా ఊహించని అనుభవం ఎదురైంది.