India Vs America: తెలుసు.. అవతలి వైపు ఉన్నది అమెరికానే! దానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే! అయినాసరే.. ఇండియా అస్సలు తగ్గట్లేదు. సుంకాల విషయంలో అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది భారత్. ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు అస్సలు తలొగ్గేదే లేదంటోంది మోడీ సర్కార్. ఇదే అంశంపై.. మంగళవారం పీఎంవోలో ఓ కీలక మీటింగ్ జరగబోతోంది.
ట్రంప్ బెదిరింపులకు తలొగ్గేలేదంటున్న మోడీ సర్కార్
ముందు.. 25 శాతం అన్నాడు.. తర్వాత.. 50 శాతానికి పెంచాడు.. అయినా సరే.. అమెరికా సుంకాల విషయంలో భారత్ వైఖరి తటస్థంగానే ఉంది. ట్రంప్ టారిఫ్‌లకు అస్సలు బెదరట్లేదు. మీరేమైనా చేసుకోండి.. మా వైకరి ఇంతే అన్నట్లుగా ఉంది ఇండియా తీరు.
ఇటీవలే అమెరికాపై సీరియస్ కామెంట్స్ చేసిన జైశంకర్
ఇటీవలే.. విదేశాంగమంత్రి జైశంకర్ కూడా.. అమెరికాపై సంచలన కామెంట్స్ చేశారు. భారత్ ఉత్పత్తులు నచ్చితే కొనండి.. లేకపోతే లేదు అన్నారు. ఆయన వ్యాఖ్యలు చూశాక.. ట్రంప్ విషయంలో ఇండియా ఓ నిర్ణయానికొచ్చేసినట్లు తెలుస్తోంది. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని ఇండియా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే.. టారిఫ్‌లతో ఎంత తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నా.. ఇండియా మాత్రం అమెరికాకు చిక్కట్లేదు. మీరేమైనా చేసుకోండి.. మాకు పోయేదేమీ లేదు అన్నట్లుగా వ్యవహారాన్ని నడిపిస్తోంది భారత్ సర్కార్.
అదనపు టారిఫ్‌లపై మంగళవారం పీఎంవోలో కీలక మీటింగ్..
మరోవైపు.. ఈ అదనపు సుంకాల వ్యవహారంపై చర్చించేందుకు.. మంగళవారం ప్రధానమంత్రి మోడీ కార్యాలయంలో.. ఓ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ముఖ్యంగా.. అమెరికా విధించిన 50 శాతం సుంకాల ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యల మీదే ఫోకస్ పెట్టారు.
ఏయే ఉత్పత్తులపై ఎక్కువ ఎఫెక్ట్ పడబోతోందన్న దానిపై చర్చ
ట్రంప్ టారిఫ్‌ల వల్ల.. భారత ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. ఆ ప్రభావాలను తగ్గించడానికి.. ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సమావేశంలో.. ఎగుమతి-ఆధారిత యూనిట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలవడంపై దృష్టి పెట్టనున్నారు. సుంకాల వల్ల ప్రభావితమయ్యే కొన్ని పరిశ్రమలకు.. ప్రత్యేక మద్దతు అందించే విషయంపైనా చర్చ జరగనుంది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం.. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ లాంటి పథకాలను అందించే ప్రతిపాదనలపైనా చర్చించనున్నారు.
భారతీయ ఎగుమతిదారులకు మేలు చేసేలా..
బుధవారం నుంచి అమెరికా మార్కెట్‌లోకి ఎంటరయ్యే ఉత్పత్తులపై.. 50 శాతం సుంకాల అమలుకానున్నాయి. ఇది.. భారతీయ ఎగుమతిదారుల మార్జిన్‌లని మరింత దెబ్బతీయడంతో పాటు సప్లై చైన్‌కి కూడా అంతరాయం కలిగిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. టెక్స్‌టైల్, ఇతర ఉత్పత్తులు, కెమికల్స్ వరకు.. కీలక రంగాల్లో పోటీని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో.. ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గానూ.. భారత్‌పై సుంకాలు పెంచడం అన్యాయమని, ఇది కరెక్ట్ కాదని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయంలో.. భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది. ఈ పరిణామంపై.. ప్రధాని మోడీ కూడా రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు భారత్ ఎప్పటికీ రాజీ పడదని.. దానికోసం ఎంత కష్టమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Also Read: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!
అందుకోసమే.. భారతీయ ఎగుమతుదారులకు ఏవిధంగా మద్దతుగా నిలవాలనే దానిపై.. ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చేందుకు.. పీఎంవోలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే.. ఇండియాతో వాణిజ్యం వల్ల.. అమెరికాకు కలిగే ప్రయోజనాల్ని వివరించేందుకు.. భారత్ యూఎస్‌లో ఓ లాబీయింగ్ టీమ్‍ని కూడా రంగంలోకి దించింది. వాళ్లంతా.. ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారితో చర్చలు జరుపుతున్నారు. వాళ్ల ద్వారా ట్రంప్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.