ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న ఎంత చండశాసనుడో మనందరికీ తెలుసు. ఈ నియంత పాలనలో ఉత్తర కొరియా ఎన్ని ఆంక్షలు ఎదుర్కొంటోందో కూడా ప్రపంచమంతా తెలుసు. కిమ్ మొహంపై చిరునవ్వుని ప్రత్యక్షంగా చూసిన వారు చాాల అరుదు. అలాగే కిమ్ బాధను కూడా దాదాపు ఎవరూ చూసి ఉండరు. అత్యంత అరుదుగా మాత్రమే అతను బాధపడిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ బయటకు వస్తుంటాయి. అలాంటి కిమ్ కన్నీరు పెట్టుకున్నారంటే ఎవరైనా నమ్ముతారా. రాయిలాంటి మనసున్న నియంత కిమ్ లో కూడా మానవత్వం ఉంది. ఆ మానవత్వమే చలించే హృదయాన్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ చలించే హృదయం కన్నీటి పర్యంతం అయింది. అలాంటి అరుదైన ఘటనే తాజాగా జరిగింది.
కన్నీటిపర్యంతం అయిన కిమ్..
ఉత్తర కొరియా సైన్యం రష్యా తరపున ఉక్రెయిన్ తో పోరాడుతోంది. దాదాపు 10వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపించారు కిమ్. ఈ పోరాటంలో కొంతమంది సైనికులు అసువులుబాశారు. అలా రష్యాకోసం పోరాడుతూ ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన ఉత్తర కొరియా సైనికులకు నివాళులర్పించే కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి బాధిత కుటుంబాలు కూడా వచ్చాయి. కుటుంబ సభ్యులంతా అయినవారికి నివాళులర్పిస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. వారిని ఓదార్చే క్రమంలో కిమ్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. సైనికుడి కుమార్తెను ఓదారుస్తూ కిమ్ కన్నీరు పెట్టుకోవడం అక్కడి మీడియాలో హైలైట్ గా మారింది. నియంత హృదయం కూడా ఈ స్థాయిలో ద్రవిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయారు.
రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఉత్తర కొరియా సైనికులు మరణించారు. ఉక్రెయిన్ సైన్యం నుండి రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని విముక్తి చేసే సందర్భంలో భీకర పోరు జరిగింది. అప్పుడు ఉత్తర కొరియా సైనికులు కొందరు మరణించారు. వారి ధైర్య సాహసాలను కిమ్ ప్రశంసించాడు. సైనికుల మృతదేహాలను రష్యా నుంచి ఉత్తర కొరియాకు తరలించారు. ఆ మృతదేహాలను తీసుకొచ్చి నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. 600మంది సైనికులకు పైగా మరణించినట్టు తెలుస్తుండగా, వారికలో కొందరి మృతదేహాలు ఇటీవల ఉత్తర కొరియాకు తరలించారు. ఈ క్రమంలో నివాళి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసి, మృతుల కుటుంబ సభ్యులను సన్మానించారు కిమ్. ఈ కార్యక్రమంలో ఆయన కూడా కన్నీటిపర్యంతం అయ్యారు.
మరణించిన సైనికుల గౌరవార్థం వారి ఫొటోల వద్ద పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ముఖ్యంగా చిన్న పిల్లలు తమ తండ్రి లేడని తెలిసి తల్లడిల్లిపోయారు. అంత పెద్ద కార్యక్రమం ఎందుకు జరుగుతుందో చాలామంది చిన్నారులకు తెలియదు. మరికొందరు ఊహ తెలిసిన వారు మాత్రం కట్టలు తెంచుకుంటున్న దుఃఖంతో అక్కడే నిలబడిపోయారు. వారందర్నీ కిమ్ దగ్గరకు తీసుకున్నారు. ఓ చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆమెను ఓదార్చే క్రమంలో కిమ్ కూడా కన్నీరు పెట్టుకున్నారు.
కిమ్ జోంగ్ ఉన్ అంటే నియంత అనే అందరికీ తెలుసు. క్రమశిక్షణ తప్పితే క్రూరమైన శిక్షలు విధిస్తాడని, సరదాలకు, విలాసాలకు దూరంగా ఉంటాడని పేరు. అదే సమయంలో ఆయనది రాతి గుండె అని, ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా పంటి బిగువున ఎదుర్కొంటాడని పేరుంది. అలాంటి కిమ్ ది కూడా జాలిగుండె అని ఈ సంఘటన రుజువు చేసింది.