ఇటీవల వచ్చిన డ్యూడ్ సినిమాలో హీరో తన భార్యను, ఆమె లవర్ ని కెనడాకు పంపించాలనుకుంటాడు. అక్కడికైతే ఈజీగా వెళ్లొచ్చని, ఈజీగా జాబ్ సంపాదించొచ్చని సినిమాలో చూపిస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా రివర్స్ లో ఉన్నాయి. కెనడా అంటే భారతీయులు భయపడిపోతున్నారు. వెళ్లినోళ్లని ఏదో ఒక నెపంతో బయటకు పంపించేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై 28 వరకు.. ఈ మధ్య కాలంలో గరిష్టంగా 1891 మంది భారతీయుల్ని కెనడానుంచి తిప్పి పంపించారు. ఇటీవల కాలంలో ఈ నెంబర్ చాలా ఎక్కువ. 2024లో మొత్తంగా 1997 మంది భారతీయుల్ని కెనడా తిప్పి పంపించింది. ఇది కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ(CBSA) అఫిషియల్ నివేదిక కావడంతో కెనడాలో భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కెనడాలో భారతీయులకు కష్టకాలం..
వాస్తవానికి అమెరికాలో భారతీయులకు మంచి రోజులు పోయాయని అంటున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వలసవచ్చేవారి మెడపై కత్తి పెట్టారు. ఉద్యోగాలన్నీ స్థానికులకే కేటాయించేలా ట్రంప్ అక్కడి కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. భారత్ తో సహా ఇతర దేశాలనుంచి ఉద్యోగాలకోసం ఎవరినైనా పిలిపించుకోవాలంటే వారికోసం ఆయా కంపెనీలు భారీగా వీసా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల విషయంలో ఛాన్స్ తీసుకోవడం మానేశాయి. దాదాపు ఇలాంటి పరిస్థితే కెనడా విషయంలో కూడా రిపీట్ అవుతోంది. కెనడాలో పరిస్థితి వేరు. అక్కడ ఉద్యోగాల కోసం కాదు, క్రైమ్ రేట్ పెరిగిపోతోందనే నెపంతో భారత్ సహా ఇతర దేశీయులపై కెనడా ప్రభుత్వం కత్తిగట్టింది. వీలైనంత మందిని వెనక్కి పంపించాలని చూస్తోంది.
ఈ ఏడాది అత్యథికం..
2019లో 625 మంది భారతీయుల్ని కెనడా ప్రభుత్వం వెనక్కు పంపించింది. 2025 నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగింది. కేవలం 8 నెలల వ్యవధిలోనే 1891మందిని తిప్పి పంపించారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఈ విషయంలో భారత్ కంటే మెక్సికో ముందుంది. 2678మంది మెక్సికన్లను కెనడా ప్రభుత్వం ఈ ఏడాది వెనక్కి పంపించింది. గతేడాది కెనడా జనాభా పెరుగుదలలో వలస వెళ్లిన వారి సంఖ్యే 97 శాతంగా ఉంది. అంటే వలస ప్రజలు అక్కడి పరిస్థితుల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వారి వల్ల స్థానికంగా జనాభా పెరగడమే కాదు, వనరులు కూడా ఖాళీ అవుతున్నాయని స్థానిక ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతోంది. దీనికి కూడా వలస వచ్చిన వారే కారణం అని కెనడా ప్రభుత్వం బావిస్తోంది. ఎక్కువ పోలీస్ కేసుల్లో కెనడాకు వెళ్లిన భారతీయులతోపాటు ఇతర దేశాల వారు చిక్కుకుపోయారు. దీంతో ప్రభుత్వం వలస వచ్చినవారిపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.
Also Read: Pak Defense Minister: తాలిబన్ల దాడి.. ఇండియా పనే, పాక్ రక్షణ మంత్రి దొంగ ఏడుపులు.. ఖండించిన భారత్
కెనడా ప్రధాని కఠిన చర్యలు
కెనడా ప్రధాని మార్క్ క్యార్నీ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. కెనడా నుంచి పంపించి వేస్తున్న మొత్తం 30,733 మంది జాబితాలో, 27,103 మంది శరణార్థి హక్కుదారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆశ్రయం కోరేవారి విభాగంలో భారతీయుల సంఖ్య కూడా ఎక్కువే. స్థానిక ప్రజల హక్కుల్ని కాపాడేందుకు, వారి రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకే అక్రమంగా నివశిస్తున్న విదేశీయుల్ని పంపించేస్తున్నామని అంటున్నారు మార్క్. అయితే చిన్న చిన్న కారణాలతో తమని పంపించి వేయడం సరికాదని తిరిగి వెళ్లిపోతున్న విదేశీయులు కెనడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గతకొన్నేళ్లుగా కెనడాలో ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటున్నా, ఇప్పుడు తమని పంపించి వేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి