భారత్.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోతే భారత్ భారీ సుంకాలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. తాజాగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ఆయన, భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. “భారత ప్రధాని మోడీతో నేను మాట్లాడాను. ఆయన రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయబోమని చెప్పారు. కానీ, ఆయన ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటే, భారీ సుంకాలు చెల్లించకతప్పదు. కానీ, ఆయన అలా చేయాలనుకోవడం లేదు” అన్నారు. పనిలో పనిగా రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందంటూ ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చిన్నట్లు చెప్పారు. ఇదో పెద్ద ముందడుగా ఆయన అభివర్ణించారు.
ఇక భారత్ చమురు దిగుమతులలో దాదాపు మూడింట ఒకవంతు రష్యా నుంచి తీసుకుంటుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ కొనుగోళ్ల కారణంగా ఉక్రెయిన్ పై స్కో యుద్ధానికి నిధులు సమకూర్చినట్లు అవుతుందన్నారు. అటు రష్యాతో ఇంధన సంబంధాలను కొనసాగించే దేశాలపై వాషింగ్టన్ ఒత్తిడిని తీవ్రతరం చేసింది. చమురు ఆదాయాలు వ్లాదిమిర్ పుతిన్ సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నాయని వాదిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) కీలక ప్రకటన చేసింది. ట్రంప్, ప్రధాని మోడీ మధ్య జరిగిన ఏ సంభాషణ గురించి తమకు తెలియదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. భారత్- అమెరికా మధ్య ఇంధన సహకారంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. అయితే, రష్యా చమురు కొనుగోళ్లను ఆపడానికి అంగీకరించిందనే ట్రంప్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు జైస్వాల్. “అమెరికాతో ఇంధన సంబంధాలను పెంచుకునే విషయంలో నిరంతర చర్చలు జరుగుతున్నాయి” అని జైస్వాల్ వివరించారు.
భారత్ నుంచి అమెరికా దిగుమతులు చేసుకుంటున్న వస్తువులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. ఈ ఏడాది ప్రారంభంలో దుస్తులు, ఔషధాలు సహా అనేక కీలక దిగుమతులపై 50 శాతం టారిఫ్ లు పెంచారు. రష్యా నుంచి అలాగే ఆయిల్ కొనుగోళ్లు కొనసాగిస్తే ఆ సుంకాలు అలాగే ఉంటాయని, అవసరం అయితే పెరుతాయన్నారు ట్రంప్. వారు ఆ సుంకాలను చెల్లించాల్సిందేనన్నారు.
భారత ఇంధన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. రష్యా గత కొద్ది సంవత్సరాల్లో భారత్ కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. మూడింట ఒకవంతు చమురు దిగుమతి రష్యా నుంచే జరుగుతుంది. రష్యన్ ముడి చమురు రాయితీ ధరలకు అమ్ముడవుతున్నందున, ఇంధన భద్రతకు అవసరమైన కొనుగోళ్లను మనదేశం చేస్తోంది. జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ ప్రయోజనాల విషయంలో ఏ ఇతర దేశం పెత్తనాన్ని, ఆంక్షలను పట్టించుకోమని ఇప్పటికే భారత్ చెప్పకనే చెప్పింది. అయినప్పటికీ ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.