Pak Defense Minister: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఇటీవల ఇరు దేశాలు ప్రత్యక్ష దాడులకు దిగాయి. అయితే సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో 48 గంటల కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయి. కాబూల్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై అక్కసు వెళ్లగక్కారు.
ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ, కాబూల్ ఢిల్లీ కోసం పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. కాల్పుల విరమణ కొనసాగే అవకాశాలపై ఆసిఫ్ సందేహం వ్యక్తం చేశారు. తాలిబన్ల అభ్యర్థన మేరకు, 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నామన్నారు.
అయితే ఆసిఫ్ మాట్లాడుతూ, తాలిబన్లకు ఢిల్లీ మద్దతు ఇస్తుండడంతో కాల్పుల విరమణ కొనసాగుతుందనే సందేహం ఉందని అన్నారు. రెచ్చగొడితే పాకిస్తాన్ సైనిక చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తీవ్ర హెచ్చరిక చేశారు. యుద్ధ పరిస్థితి వస్తే ఆఫ్ఘన్ పై దాడి చేస్తామన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ నిర్మాణాత్మక చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇటీవల కాబూల్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై అకస్మాత్తుగా దాడి చేసి 58 మంది సైనికులను చంపిందని, పాక్ భూభాగం, గగనతలంలో ఉల్లంఘనలకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తుంది. తమ సైనికుల మరణాల సంఖ్య తక్కువగా ఉందని పాక్ తెలిపింది. సరిహద్దు వెంబడి జరిగిన కాల్పుల్లో 23 మంది సైనికులు మరణించగా, 200 మందికి పైగా తాలిబాన్లు మరణించారని పేర్కొంది.
కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక మార్కెట్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఇస్లామాబాద్ ఆ ఆరోపణలను అధికారికంగా ధృవీకరించలేదు. ఆఫ్ఘన్ లో ఉగ్రస్థావరాల లక్ష్యంగా దాడులు జరిపినట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ ఉగ్రవాద సంస్థతో ఆఫ్ఘన్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తుంది.
Also Read: Pak Defense Minister: తాలిబన్ల దాడి.. ఇండియా పనే, పాక్ రక్షణ మంత్రి దొంగ ఏడుపులు.. ఖండించిన భారత్
ఉగ్రవాదులకు తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అయితే, కాబూల్ ఈ వాదనలను ఖండించింది. ఇతర దేశాలపై దాడులకు తన భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి తాను అనుమతించబోనని తాలిబన్లు తెలిపారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి పెరిగిన పాక్ లో ఉగ్ర కార్యకలాపాలు పెరిగాయని ఆ అధికారులు ఆరోపిస్తున్నారు.