SIR Movie:సాధారణంగా దర్శకులు కొన్ని కథలు రాసుకునేటప్పుడు ఫలానా క్యారెక్టర్ లో ఫలానా నటీనటులను ఊహించుకొని ఆ కథలకు ప్రాణం పోయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ కథలను తీసుకెళ్లి తాము అనుకున్న నటీనటులకు వినిపించినప్పుడు.. వారికి నచ్చితే ఓకే చెబుతారు.. మరికొంతమంది నచ్చినా.. సమయం లేక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ పాత్రలు వేరొకరు చేయడం.. అవి సక్సెస్ కొట్టడం లాంటివి చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్ భాషలలో బైలింగ్వల్ గా విడుదలైన చిత్రం సార్. వెంకీ అట్లూరి(Venky atluri) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఇది.
ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాయికుమార్ , తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. 2023 మార్చి 17న విడుదలై.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటి ఛాయిస్ ధనుష్ కాదట.. ఈ విషయాన్ని తాజాగా మాస్ జాతర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ మాస్ మహారాజా రవితేజ హీరోగా, శ్రీ లీల హీరోయిన్గా రాబోతున్న చిత్రం మాస్ జాతర. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా పడింది. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవితేజతో దర్శకుడు వెంకీ అట్లూరి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో మాట్లాడుతూ.. ఒక ఊహించని విషయాన్ని బయట పెట్టారు వెంకీ అట్లూరి.
also read:Sankranti 2026: సంక్రాంతి రేస్ లోకి మరో మూవీ.. టఫ్ ఫైట్ ఉండనుందా?
అదే తాను దర్శకత్వం వహించిన సార్ మూవీ.. ఈ సినిమా కోసం మొదటగా ధనుష్ కాదు రవితేజను అనుకున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ..” కరోనా సమయంలో నేను రవితేజ అన్నకు ఫోన్ చేశాను. సార్ కథ చెప్పాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. అయితే ఆ సమయంలో రవి అన్న చాలా బిజీగా ఉన్నారు. దాంతో ఆ ప్రాజెక్టు షెడ్యూలు కుదరలేదు. నిజానికి అన్న వెయిట్ చేస్తావా చెయ్యి లేదంటే ఇంకొకరితో చేసేయమని చెప్పారు. ఆ సమయంలో నాకు వేరే దారి లేక ధనుష్ తో ఫైనలైజ్ చేసాను ” అంటూ వెంకీ అట్లూరి తెలిపారు. అయితే ఇది విన్న రవితేజ అభిమానులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సార్ సినిమాలో చూపించిన ఎమోషనల్ లెవెల్.. సోషల్ మెసేజ్ అన్ని రవితేజ స్టైల్ లో ఉంటే ఎలా ఉండేదో అనే కుతూహలం కూడా ఇప్పుడు మొదలైంది. మొత్తానికి అయితే ఒక మంచి సినిమాను బిజీ షెడ్యూల్ వల్ల మిస్ చేసుకున్నారు రవితేజ.