Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దీపావళి పండుగ వేళ తన మనసులోని ఆవేదనను, అసంతృప్తిని బాహాటంగా వెల్లడించారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన మానసిక హింసకు, పార్టీలో ఎదుర్కొంటున్న క్షోభకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.
‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నన్ను మేకలా బలిచ్చారు. ఆ ఇద్దరి వల్ల రోజూ ఎంతో క్షోభను అనుభవిస్తున్నాను, అని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెట్టి, ఇటీవల పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయించినోడికి ప్రాధాన్యత ఇస్తారా?
కాంగ్రెస్‌లో పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ‘పార్టీ ఫిరాయించినోడికి ఇప్పటికీ సభ్యత్వం కూడా లేదు’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్ధాంతం ఏమిటో అర్థం కావడం లేదని, పార్టీ ఫిరాయించిన వ్యక్తులు చెప్తేనే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.
‘నాకు ఏ పదవులు అవసరం లేదు. ఇకనుంచి నా పని కార్యకర్తలను కాపాడుకోవడమే’ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సీనియర్ నేత, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి బహిరంగంగా మంత్రులపై, పార్టీ విధానాలపై చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టించాయి. పార్టీలో అంతర్గత విభేదాలు, సీనియర్ల అసంతృప్తి మరోసారి బయటపడటానికి ఈ పరిణామాలు దారి తీశాయి.