No Kings Protests: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. శనివారం అమెరికాలోని ప్రధాన నగరాల్లో “నో కింగ్స్” పేరిట పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహించారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ఏంజెలెస్, షికాగో సహా మొత్తం 50 నగరాల్లో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు చేశారు.
కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్ లోని అమెరికా రాయబార కార్యాలయాల ముందు ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసల నియంత్రణ, యూనివర్సిటీల నిధుల తగ్గించడం, అధిక పన్నులు, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాల మోహరింపు వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ నిరంకుశ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆ దేశ పౌరులు నిరసనలకు దిగారు.
“నిరసన వ్యక్తం చేయడం కంటే దేశభక్తి లేదు”, “ఫాసిజాన్ని ప్రతిఘటించండి” వంటి ప్లకార్డులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద భారీగా నిరసనకారులు ర్యాలీ చేశారు. బోస్టన్, అట్లాంటా, చికాగోలోని పార్కులలో వేలాది మంది నో కింగ్స్ ర్యాలీలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ, డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్ లలో నిరసన ర్యాలీలు జరిగాయి. అమెరికా వ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ ప్రదర్శనలకు నిరసనకారులు ప్రణాళిక చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఈ నిరసన ర్యాలీలను “హేట్ అమెరికా” ర్యాలీలుగా పేర్కొంది. కానీ చాలా చోట్ల ఈ నిరసనలు వీధి పార్టీల్లా ఉన్నాయని ఎద్దేవా చేసింది.
ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇది మూడో అతి పెద్ద నిరసన ర్యాలీగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న నౌకాదళానికి చెందిన షాన్ హోవార్డ్ మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందు ఎప్పుడూ నిరసనలో పాల్గొనలేదని, కానీ ట్రంప్ నిరంకుశ పాలన చూసి ఈ నిరసనలో పాల్గొన్నానని చెప్పారు. సరైన విధానం లేకుండా వలస నిర్బంధాలు, యూఎస్ నగరాల్లో దళాలను మోహరించడం, అమెరికన్ వ్యతిరేకత, ప్రజాస్వామ్యం క్షీణిస్తోందన్న సంకేతాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.
తాను విదేశాలలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని హోవార్డ్ అన్నారు. తాను CIAలో 20 సంవత్సరాలు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై పనిచేశానని చెప్పారు. కానీ ఇప్పుడు అమెరికాలో ప్రతిచోటా తీవ్రవాదులు ఉన్నారని, వీళ్లు ఏదో ఒక రకమైన సంఘర్షణకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.
HAPPENING NOW: Across the U.S. people hit the streets by the millions for No Kings Day, with some crowds estimated to be in the hundreds of thousands. pic.twitter.com/NO6ciszIuO
— BreakThrough News (@BTnewsroom) October 18, 2025
నో కింగ్స్ నిరసనలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. నిరసనకారులు తనను రాజుగా ప్రస్తావిస్తున్నారని, తాను రాజును కాదని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.
Also Read: Trump on AFG vs PAK: పాక్-ఆఫ్ఘన్ యుద్ధం ఆపడం నాకు చాలా ఈజీ.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట
శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓషన్ బీచ్‌లో వందలాది మంది ప్రజలు “నో కింగ్స్” ర్యాలీలో పాల్గొన్నారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వేషధారణలో ఉన్న మహిళ ట్రంప్ నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. లాస్ ఏంజిల్స్, చికాకూ, పోర్ట్ ల్యాండ్ లలో సైనికులను మోహరించే వరకు నేను ట్రంప్ నకు మద్దతుగా ఉన్నానన్నారు. కానీ పోర్ట్ ల్యాండ్ లో సైనికుల మోహరింపు తనను ఎక్కువగా బాధపెట్టిందన్నారు. ఈ ఏడాది జూన్ చేపట్టిన “నో కింగ్స్” ర్యాలీలో ఒక ఆందోళనకారుడిని పోలీసులు కాల్చి చంపారు. శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలలో ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు తెలిపారు.