అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇండియాపై సుంకాల మోత మోగించాడు. దానికి అసలు కారణం ఏంటి? రష్యాతో కుదుర్చుకున్న చమురు ఒప్పందం వల్ల భారత్ పై ట్రంప్ కక్షగట్టారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అదంతై పైకి ట్రంప్ చెబుతున్న సాకు మాత్రమే. అసలు కారణం ఆయన డబ్బు ఆశ అంటున్నారు అమెరికా తరపున గతంలో జపాన్ లో రాయబారిగా పనిచేసిన రహమ్ ఇమ్మాన్యుయేల్. భారత్ తో సత్సంబంధాలను ట్రంప్ తన అహంకారంతో నాశనం చేశారని మండిపడ్డారు.
నోబెల్ పై ఆశ..
భారత్ – పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానని చెప్పుకున్నారు ట్రంప్. కానీ భారత ప్రధాని మోదీ ఆ వాదనను తోసిపుచ్చారు. దీంతో ట్రంప్ కి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆయన ఊహించింది వేరు, యుద్ధం ఆపింది తనేనని చెబుతూ, తనను మోదీ నోబెల్ కి నామినేట్ చేస్తారని ఊహించారు ట్రంప్. కానీ అది జరగలేదు. అక్కడ్నుంచి ఆయన భారత్ పై కక్షగట్టారు. మరోవైపు పాకిస్తాన్ ట్రంప్ ని నోబెల్ కి నామినేట్ చేసింది. దీంతో ఆ దేశంతో ఆయన అంటకాగడం మొదలు పెట్టారు.
డబ్బుపై ఆశ..
పాకిస్తాన్ తో ఇటీవల అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల ట్రంప్ కుటుంబానికి బాగా లబ్ధి చేకూరుతుంది. ట్రంప్ కొడుకు, అమెరికాలోని అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి విట్కాఫ్ కొడుకు.. ఇద్దరూ పాకిస్తాన్ లో క్రిప్టో కౌన్సిల్ ని స్థాపించారు. దాని ద్వారా వచ్చే డబ్బుకి ట్రంప్ ఆశపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సంస్థతో పాకిస్తాన్ వ్యాపార లావాదేవీలను కుదుర్చుకుంది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, జారెడ్ కుష్నర్ వాటాలను కలిగి ఉన్న ఈ సంస్థ ద్వారా ట్రంప్ కి ప్రత్యక్ష మేలు జరుగుతుంది.
భారీ మూల్యం..
ట్రంప్ అత్యాశకు పోయి భారత్ ని శత్రువుగా చేసుకున్నారని, దీనివల్ల అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటుందని అంటున్నారు రహమ్ ఇమ్మాన్యుయేల్. అదే సమయంలో రష్యా, చైనాలకు అమెరికా ఒక అవకాశాన్నిచ్చిందని అంటున్నారు. రష్యా-భారత్-చైనా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికా అవకాశమిచ్చిందని చెప్పారు. దీనివల్ల అమెరికాకు రాబోయే రోజుల్లో మరింత నష్టం జరుగుతుందని అన్నారు.
Also Read: Pak Defense Minister: తాలిబన్ల దాడి.. ఇండియా పనే, పాక్ రక్షణ మంత్రి దొంగ ఏడుపులు.. ఖండించిన భారత్
అమెరికా ప్రతీకార సుంకాల వ్యవహారంలో భారత్ కి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రపంచ దేశాలు ఊహించాయి. కానీ భారత్ ఈ విషయంలో అమెరికా ముందు సాగిల పడలేదు సరికదా, రష్యాతో డీల్ ని కూడా క్యాన్సిల్ చేసుకోలేదు. దీంతో అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే దీనివల్ల అంతర్జాతీయంగా భారత్ కి ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషించడం మొదలు పెట్టింది. దీనివల్ల అమెరికా కాకుండా ఇతర మార్కెట్లపై భారత్ దృష్టి పెడుతోంది. అదే సమయంలో చైనా, రష్యాతో కూడా మైత్రి బలపడేలా కనపడుతోంది. దీని వల్ల అమెరికాకు నష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకార ఫలితమేనని మండిపడుతున్నారు.