ఢిల్లీ మెట్రో గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. సీటు కోసం కొట్లాడుకునే ఇన్సిడెంట్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక యువతీ యువకులు రీల్స్ పేరుతో చేసిన చెత్త డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. కానీ, అందుకు భిన్నంగా ముగ్గురు చిన్న బాలికలు చక్కటి సంప్రదాయ దుస్తుల్లో వేసిన డ్యాన్స్ ఇప్పుడు అందిరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
రీసెంట్ గా ఢిల్లీ మెట్రోలో ముగ్గురు బాలికలు ‘హమ్ ఆప్కే హై కౌన్’ సినిమాలో ‘పెహ్లా పెహ్లా ప్యార్ హై’ అనే పాటకు చక్కగా డ్యాన్స్ చేశారు. వారి డ్యాన్స్ చూసి రైల్లోని వాళ్లంతా ఎంతో ఖుషీ అయ్యారు. ఈ వీడియోను జ్యోతి JSK అనే యూజర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 5.5 మిలియన్ల మంది నెటిజన్లు చూశారు. ఈ వీడియోలో, అమ్మాయిలు రంగురంగుల హర్యానీ, రాజస్థానీ దుస్తులు ధరించి, ప్రయాణికులు చూస్తుండగా ఉత్సాహంగా, అద్భుతమైన హావభావాలతో చక్కటి డ్యాన్స్ చేశారు.
ఈ వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రైల్లో ఎంతో మంది ఉన్నా, ముందుకు కదులుతున్నా, ఆత్మవిశ్వాసంతో, చక్కటి భావాలతో అద్భుంగా డ్యాన్స్ చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వారి వీడియోను అభినందిస్తూ చాలా మంది లవ్ ఎమోజీలతో కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని సమోసాల విక్రేత దౌర్జన్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు!
మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్సలు అంటూ పలువురు ప్రయాణీకులు రచ్చ చేస్తున్న నేపథ్యంలో కొద్ది వారాల క్రితం ఢిల్లీ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా మెట్రో పరిసరాలతో పాటు మెట్రో రైళ్లలోనూ రీల్స్, వీడియోలను షూట్ చేయడాన్ని నిషేధించారు. రైళ్లు, స్టేషన్ల లోపల రీల్స్ చేయకూడదంటూ ప్రకటనలు ఏర్పాటు చేసింది. మెట్రో ప్రాంగణంలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు, ఇతర సోషల్ మీడియా కంటెంట్ ను చిత్రీకరించవద్దని ప్రయాణీకులను హెచ్చరించింది. సెప్టెంబర్ 14 నుంచి ఈ చర్యలు అమల్లోకి రాగా, ఇకపై అన్ని రైల్వే లైన్లలో కఠినంగా అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో హెచ్చరిక ప్రకటనలను ఏర్పాటు చేశారు. కోచ్‌ల లోపల తినడం, కింద కూర్చోవడం లాంటివి చేయకూడదన్నారు. “రీల్స్, డ్యాన్స్ వీడియోలు, ఇతర సోషల్ మీడియా కంటెంట్ ను మెట్రో రైళ్లు, పరిసరాల్లో కచ్చితంగా నిషేధించబడ్డాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు” అని అధికారులు వెల్లడించారు.
Read Also: కోచ్ లోపల రీల్స్ చేస్తే తోలు తీస్తాం, మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్!