ఆపరేషన్ సిందూర్ సమయంలో మనం మూడు దేశాలతో తలపడ్డామని ఇటీవల భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ కు చైనా, టర్కీ సాయం చేశాయని ఆయన చెప్పారు. ఈ ఆరోపణలపై తాజాగా చైనా స్పందించడం విశేషం. ఆపరేషన్ సిందూర్ టైమ్ లో తాము పాకిస్తాన్ కి ఎలాంటి సైనిక సాయం చేయలేదని ఆదేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. చైనా, పాకిస్తాన్ పొరుగుదేశాలు మాత్రమేనని, సహజంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉండే సత్సంబంధాలే తమ మధ్య ఉన్నాయని ఆయన చెప్పారు. అంతే తప్ప సైనిక సహకారం అందించలేదని, మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకుని తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. అదే సమయంలో ఆయన భారత్-చైనా సంబంధాలపై కూడా స్పందించారు. బీజింగ్-ఢిల్లీ ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన వృద్ధిని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత మెరుగయ్యే కీలక దశలో ఉన్నాయని చెప్పారు మావో. అయితే ఫ్రాన్స్ తయారీ రాఫెల్ జెట్ల పనితీరుపై సందేహాలను సృష్టించేందుకు చైనా తన రాయబార కార్యాలయాలను ఉపయోగించిందనే ఆరోపణలపై మాత్రం ఆయన స్పందించలేదు.
పాక్ స్పందన..
ఇదే విషయంపై పాకిస్తాన్ కూడా స్పందించడం విశేషం. భారత్ తో జరిగిన పోరులో తమకు విదేశాల నుంచి ఎలాంటి సాయం అందలేదని పాకిస్తాన్ తాజాగా ప్రకటించింది. పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. “ఆపరేషన్ బన్యాన్ అల్ మార్‌సూస్”ను తాము విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారాయన. దీనికి విదేశీ సాయం తీసుకున్నామనడం సరికాదన్నారు. దశాబ్దాలపాటు చేసిన కృషితో దేశీయంగా తమ సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరచుకున్నామని, అయితే కొన్ని దేశాలు దాన్ని గుర్తించడానికి ఇష్టపడట్లేదని చెప్పారు. పూర్తిగా రెండు దేశాలకు పరిమితమైన సైనిక ఘర్షణలో ఇతర దేశాల పేర్లను లాగడం సరికాదన్నారు ఆసిం మునీర్. పొరుగు దేశాల సాయం తీసుకున్నా, దాన్ని ఒప్పుకోడానికి పాక్ సిద్ధంగా లేదు. పాక్ మేకపోతు గాంభీర్యమే ఆపరేషన్ సిందూర్ విషయంలో ఆ దేశానికి నష్టాన్ని చేకూర్చింది. చైనా సమకూర్చిన క్షిపణి రక్షణ వ్యవస్థ విఫలం కావడంతో పాక్ తోకముడిచింది. విధిలేని పరిస్థితుల్లో కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఆధారాలతోనే ఆరోపణలు..
భారత్ ఆరోపణలపై చైనా, పాకిస్తాన్ ఒకే సమయంలో రియాక్ట్ కావడం ఇక్కడ విశేషం. ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ నుంచి డ్రోన్ల సాయం అందిందనేది కాదనలేని వాస్తవం. అదే సమయంలో సరిహద్దుల్లో యుద్ధ వ్యూహాలపై అటు చైనా కూడా పాక్ కి సాయం అందించినట్టు భారత్ వద్ద ఆధారాలున్నాయి. చైనా తాను తయారు చేసిన ఆయుధాలకు లైవ్ ల్యాబ్ లాగా పాకిస్తాన్ ని ఉపయోగించుకుందని అన్నారు భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్. మూడు దేశాలు కలసి భారత్ పైకి వచ్చినా, వారి కుయుక్తుల్ని సమర్థంగా తిప్పికొట్టామని చెప్పారు. ఆయన వ్యాఖ్యల తర్వాత ఆ మూడు దేశాల్లో అలజడి రేగింది. ముఖ్యంగా చైనా తడబాటుకి గురైంది. పాకిస్తాన్ కి తాము సాయం చేయలేదని వివరణ ఇచ్చుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా తమకి ఎవరూ సాయం చేయలేదని, ఎవరి సాయం తమకు అక్కర్లేదని చెప్పడం విశేషం.