రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తాను సర్వ శక్తులు ఒడ్డుతున్నానని చెబుతుంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నట్టు ఆయన బిల్డప్ ఇస్తున్నారు. రష్యాపైనే కాదు, రష్యాతో వ్యాపార సంబంధాలు పెట్టుకునే ఇతర దేశాలపై కూడా ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అంటే ఒకరకంగా ఉక్రెయిన్ పై ఆయనకు సింపతీ ఉందని అనుకుంటారంతా. కానీ వైట్ హౌస్ లో జరిగిన తాజా చర్చలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కి షాకిచ్చాయి. అసలు ట్రంప్ మద్దతు తమకా, రష్యాకా అని ఆయన ఆలోచనలో పడ్డారు.
అసలేం జరిగింది?
రష్యా, ఉక్రెయిన్ మధ్య సయోధ్యకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలంటే ఆ దేశానికి సంబంధించిన డాన్ బాస్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలన్నారు. ఉక్రెయిన్ కి అది ఇష్టం లేదు. కానీ ట్రంప్ కి మాత్రం ఇదే నచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని వైట్ హౌస్ కి పిలిపించి ఈ ప్రతిపాదన ఆయన ముందుంచారు. ఆయన ఒప్పుకోలేదు. ఇంకేముందు ట్రంప్ కి చిర్రెత్తుకొచ్చింది. ఒప్పుకోవాల్సిందేనంటూ గద్దించారు. అలా అప్పగిస్తేనే రష్యా యుద్ధం ఆపేస్తుందన్నారు. లేకపోతే ఉక్రెయిన్ నాశనమవుతుందని హెచ్చరించారు.
వైట్ హౌస్ లో రచ్చ రచ్చ
వైట్ హౌస్ లో జరిగిన చర్చలు రచ్చ రచ్చగా మారాయి. జెలెన్ స్కీ పై రంకెలు వేసిన ట్రంప్.. ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ మ్యాప్ లను విసిరి వేశారు. వాస్తవానికి లాంగ్ రేంజ్ టోమాహాక్ క్రూయిజ్ క్షిపణుల ఒప్పందం కుదుర్చుకోడానికి జెలెన్ స్కీ వైట్ హౌస్ కి వెళ్లారు. అయితే అక్కడ జరిగిన గొడవతో ఆయన వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఆయన అభ్యర్థనను వినిపించుకోకుండా ట్రంప్ తనకు ఆరోగ్యం బాగోలేదని తిప్పి పంపించేశాడు. రష్యా ప్రతిపాదనకు జెలెన్ స్కీ సుముఖంగా లేకపోవడంతో ఆయనపై తన కోపాన్ని అలా ప్రదర్శించాడు ట్రంప్. ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే ఉక్రెయిన్ నాశనాన్ని జెలెన్ స్కీ కోరుకున్నట్టేనని కాస్త పరుషంగానే మాట్లాడాడు ట్రంప్.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి
ట్రంప్ ఆంతర్యమేంటి..?
డొనాల్డ్ ట్రంప్ మానసిక స్థితిపై చాలామందికి అనుమానాలున్నాయి. రష్యాతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్న కారణంగా భారత్ పై ప్రతీకార సుంకాలతో దాడి చేశారు ట్రంప్. సంబంధం లేకపోయినా భారత్ – పాక్ యుద్ధాన్ని ఆపానంటూ బీరాలు పలికేవారు. నోబెల్ బహుమతికి తాను తగనా అంటూ లాజిక్ తీసేవారు. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, ఆ దేశంతో సంబంధాలు పెట్టుకున్న ఇతర దేశాల పరిస్థితి కూడా అంతేనంటూ శాపనార్థాలు పెట్టిన ట్రంప్.. నేడు జెలెన్ స్కీ తో జరిగిన చర్చల్లో రష్యా ఆర్థిక పరిస్థితిని మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. అసలింతకీ ట్రంప్ రష్యాకు అనుకూలమా, సానుకూలమా, ఉక్రెయిన్ పై ఆయనకు ఉన్నది ప్రేమా, ద్వేషమా అనేది తేలట్లేదు. పైకి రష్యాను కట్టడి చేస్తున్నట్టు కనిపిస్తున్నా, యుద్ధం ఆపే విషయంలో ఉక్రెయిన్ పై ఆంక్షలు పెట్టడాన్ని ప్రపంచ దేశాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. జెలెన్ స్కీ కూడా ట్రంప్ వ్యవహారంతో విసిగిపోయి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: భారతీయుల్ని తరిమేస్తున్న కెనడా..