ఎన్నికలంటే రాజకీయం ఒక్కటే కాదు! రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చే హామీలు కూడా! బీహార్ ఎన్నికల్లో.. అధికార ఎన్డీయే కూటమి, అధికార పీఠం కోసం పోరాడుతున్న మహా ఘట్‌బంధన్.. బీహారీలపై వరాల జల్లులు కురిపిస్తున్నాయ్. తాము అధికారంలోకి వస్తే.. వేల కోట్ల రూపాయలను జన సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెబుతున్నాయ్. కానీ.. పవర్‌లోకి వచ్చాక ఏ ప్రభుత్వానికైనా.. ఉచిత పథకాల అమలు సాధ్యమవుతుందా? వాటికయ్యే ఖర్చు భారాన్ని.. సర్కార్ భరించగలుగుతుందా? అసలు.. హామీల అమలు భారం ఎలా ఉంటుందో ఊహించగలరా?
అయినా.. వాళ్లు మాత్రం ఏం చేస్తారు? పవర్‌లో ఉన్న పవర్ అలాంటిది. అందుకోసమే.. బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు.. అన్ని పార్టీలు భారీ హామీలను ప్రకటిస్తున్నాయ్. ముఖ్యంగా మహిళల్ని, నిరుద్యోగులను, యువతను.. తమ వైపు తిప్పుకునేందుకు.. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా వరాల జల్లు కురిపిస్తున్నాయ్. బీహార్‌లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు 30 వేల చొప్పున నెలవారీ వేతనం చెల్లిస్తామన్నారు తేజస్వి యాదవ్. అంతేకాదు.. వారిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. వారు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామన్నారు. అంతేకాదు.. 5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు తేజస్వి. అయితే.. బిహార్‌లో జీవికా దీదీలు 10 లక్షల మంది వరకు ఉన్నారు. వాళ్లందరినీ పర్మినెంట్ చేసి.. నెలకు 30 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తే వేల కోట్లు భారం ప్రభుత్వంపై పడుతుందని చెబుతున్నారు.
ఇండియా కూటమి ఇచ్చిన అతి పెద్ద హామీల్లో మరొకటి.. ఉద్యోగాల క్రమబద్ధీకరణ. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ.. పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక.. మహిళా సంక్షేమం, సాధికారత కోసం.. బేటీ, మా అనే కొత్త పథకాలను ప్రారంభిస్తామన్నారు. మా అంటే.. మకాన్, అన్, ఆమ్దానీ.. అంటే ఇల్లు, ఆహారం, ఆదాయం అందిస్తామని చెబుతున్నారు. ఇక.. స్వయం సహాయక బృందాలు, పేదలు తీసుకున్న రుణాలపై.. రెండేళ్ల దాకా వడ్డీ మాఫీ చేయడం, వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈబీసీ వర్గాలకు రిజర్వేషన్లను.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా 50 శాతానికి పైగా పెంచుతామన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతోంది ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి. ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు తేజస్వీ యాదవ్.
జేడీయూ, బీజేపీ కలిసున్న ఎన్డీయే కూటమి కూడా భారీ హామీలను ప్రకటించింది. ఇప్పటికే.. నితీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిశ్చయ్ పథకాలను కొనసాగించడంతో పాటు విస్తరిస్తామని చెబుతున్నారు. ఇక.. వికాస్ మిత్రలుగా పిలిచే.. గ్రామీణ సంక్షేమ ఉద్యోగులకు డీఏతో పాటు స్టేషనరీ భత్యాలను పెంచుతామన్నారు. వారి డిజిటల్ కార్యకాలాపాల కోసం టాబ్లెట్‌లు కొనుగోలు చేసేందుకు 25 వేలు అందిస్తామని చెప్పారు. ఇక.. నిశ్చయ్ సెల్ఫ్-హెల్ప్ అలవెన్స్ స్కీమ్ కింద.. 20 నుంచి 25ఏళ్ల వయసు గల నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు వెయ్యి రూపాయలు అందిస్తామన్నారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది ఎన్డీయే కూటమి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన మై బెహన్ మాన్ యోజన లాంటి పథకాల ద్వారా మహిళలకు 10 వేల ఆర్థికసాయం అందించింది. అదేవిధంగా వితంతు పెన్షన్లను 400 నుంచి 1400లకు పెంచుతామంటున్నారు. పదవీ విరమణ చేసిన 95 వేల మంది ఆశా, 4600 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు గౌరవ వేతనాలను పెంచింది. తక్కువ వడ్డీతో రుణాలు అందించింది.
బీహార్ ఎన్నికల యుద్ధాన్ని గెలవాలంటే.. మహిళల ఓట్లే కీలకమని.. అన్ని పార్టీలు భావిస్తున్నాయ్. నిజానికి.. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది మహిళలు.. సంప్రదాయకంగా నితీశ్ కుమార్ ఓట్ బ్యాంకుగా ఉన్నారు. 2020 ఎన్నికల మాదిరిగానే.. ఈ ఎలక్షన్‌లోనూ కీ-రోల్ పోషించనున్నారు. అందుకోసమే.. బీజేపీ,ఆర్జేడీ కూటమి అందిస్తున్న పథకాలను మించి.. మహిళా ఓటర్లని ఆకట్టుకునేలా ఆర్జేడీ హామీలను ప్రకటిస్తోంది. అయితే.. బీజేపీ మాత్రం ఈ హామీలపై విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా.. దాదాపు 3 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామనే హామీని.. ఆర్జేడీ ఎలా నెరవేర్చగలదని ప్రశ్నించింది. ఇదంతా అవగాహనలేమితో ఇస్తున్న ఎన్నికల హామీలని కొట్టిపారేసింది. అయితే.. మహిళలకు 10 వేల రూపాయలు పంపిణీ చేయడాన్ని.. ఓట్ల కోసం ఇస్తున్న లంచం అని.. విపక్షాలు విమర్శిస్తున్నాయ్. కానీ.. ఎన్డీయే కూటమి మాత్రం అది అప్పు అని.. చెబుతోంది. ఏదేమైనా.. ఒక్కటి మాత్రం వాస్తవం. బీహార్‌లో మహిళా ఓటర్లే కీలకం. ఐదేళ్ల క్రితం బీజేపీ-జేడీయూ కూటమి 60 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకుంది. వీటిలో.. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయ్. అందుకోసమే.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు ఉన్న మహా ఘట్ బంధన్.. వీలైనన్ని ఎక్కువ మహిళల ఓట్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాయ్.
బీహార్‌లో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడంలో అస్సలు తగ్గట్లేదు. ఒకరిని మించి మరొకరు హామీలివ్వడంలో తప్పులేదు. కానీ.. ఎంత మూల్యానికి? అధికారంలోకి వచ్చేందుకు భారీ హామీలు ప్రకటిస్తున్నారు సరే.. అది సర్కారు ఖజానాపై ఎంత భారం పడుతుందనేది ఆలోచించే చెబుతున్నారా? లేక.. ఎన్నికలు గట్టెక్కేందుకు.. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతున్నారా? ఈ హామీలను గనక నెరవేరిస్తే.. బీహార్ ఖజానాపై పడే భారమెంత?
బీహార్.. దేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. సరైన ఉపాధి అవకాశాలు లేక.. భారీ స్థాయిలో వలసలను ఎదుర్కొంటోంది. పొట్ట చేతబట్టుకొని సౌతిండియా స్టేట్స్‌కు వచ్చిన బిహారీలు లక్షల్లో ఉంటారు. అయితే.. ఈ ఎన్నికల సమయంలో అక్కడి రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు గుప్పిస్తున్న హామీలపైనే.. ఇప్పుడు దేశం మొత్తం చర్చ నడుస్తోంది. కానీ.. ఇవి ఆచరణలో సాధ్యమేనా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే.. కొన్నేళ్లుగా బీహార్ బడ్జెట్‌లో నిర్దేశించిన ఆర్థిక లోటు లక్ష్యం నెరవేరడం లేదు. ఇలాంటి సమయంలో.. హామీల అమలు ఏ విధంగా సాధ్యమవుతుందనే చర్చ మొదలైంది. అయినప్పటికీ.. ఈ ఎన్నికల్లో పార్టీలు హామీల వరద పారిస్తున్నాయ్. మహిళలకు నగదు బదిలీతో పాటు ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం, వృద్ధులకు అదనపు పెన్షన్ల లాంటివెన్నో ప్రకటించాయ్.
బీహార్‌లో 2.8 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 20 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు.. తేజస్వి యాదవ్ 2.6 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇన్ని ఉద్యోగాలు కల్పించడానికి, రూ.12 లక్షల కోట్లు అవసరమవుతుంది. ఇది బీహార్ బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ లెక్కలేవీ వేసుకోకుండానే.. ఆర్జేడీ ఇంత భారీ హామీ ఎలా ప్రకటించిందనేదే బిగ్ డౌట్. ఎన్డీయే కూటమి ప్రకటించినట్లు.. మహిళలకు స్వయం ఉపాధి కోసం 10 వేలు పంపిణీ చేసేందుకు.. ఒక్కసారికే 10 వేల కోట్లు అవసరమవుతుంది. అలాగే.. ఇప్పుడున్న పెన్షన్లని 400 నుంచి 1400 పెంచేందుకు.. 8 వేల 400 కోట్ల అవసరమవుతాయ్. ప్రతి నెలా 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు 3800 కోట్లు కావాలి. 5 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇవ్వాలంటే.. 600 కోట్లకు పైనే ఖర్చవుతుంది. ఇక.. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి చెప్పినట్లుగా.. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు నెలకు 2500 నగదు చెల్లించేందుకు 30 వేల కోట్లు అవసరమవుతాయ్. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలంటే.. 6 వేల కోట్లు కావాలి. ఇక.. జన సురాజ్ పార్టీ పెన్షన్లను 400 నుంచి 2 వేలకు పెంచుతామని చెప్పింది. ఇందుకోసం.. 19 వేల 200 కోట్లు అవసరమవుతాయ్. అయితే.. ఈ హామీలన్నింటిని అమలు చేసేందుకు.. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నకు మాత్రం.. ఏ రాజకీయ పార్టీ సమాధానం ఇవ్వడం లేదు.
ఇంత భారీ హామీలు ఇచ్చిన పార్టీలు.. ఎన్నికల్లో గెలవకపోవచ్చు. అలాగే.. గెలిచిన పార్టీ వాటిపై చర్య తీసుకోకూడదని ఎంచుకోవచ్చు. లేకపోతే.. ఖర్చుని తగ్గించుకునేందుకు.. లబ్ధిదారుల సంఖ్యని కూడా తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టి ఎంతో అవసరమున్న రాష్ట్రానికి.. ఈ ఎన్నికల హామీల అమలనేది.. చాలా పెద్దది. దేశంలో.. బీహార్ ఇప్పుడో పేద రాష్ట్రం. దాని.. NDSP లక్షా 70 వేల లోపే ఉంది. ఇది.. మిగతా రాష్ట్రాలకన్నా చాలా తక్కువ. మరోవైపు.. ఉద్యోగాల కోసం బీహార్ ప్రజలు ఇతర రాష్ట్రాలకు సామూహికంగా వలస వెళ్తున్నారు. ఫలితంగా.. అత్యల్ప కార్మిక శక్తి భాగస్వామ్య రేటుని కలిగి ఉంది. ప్రస్తుతం.. బీహార్ ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది.. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో 23 లక్షల మంది ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే బిగ్ ఎగ్జాంపుల్.
తమ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి బదులుగా.. బీహార్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో బ్యాండ్-ఎయిర్ పరిష్కారాల కోసమే ముందుకెళ్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్.. బీహార్‌లోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కానీ.. ఇన్ని ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారనే దానికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. దాదాపు.. 42 వేల మూలధన వ్యయాన్ని మాత్రమే ప్లాన్ చేసిన రాష్ట్రం.. ఏడాదికి.. 600 నుంచి 30 వేల కోట్లు ఖర్చు చేయగలిగే.. వాగ్దానాలను ప్రకటించింది. ఇప్పటికే.. బీహార్ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో.. తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని.. GSDPలో 3 శాతానికి పైగా బడ్జెట్‌లో పెట్టుకుంది. ఈ సంఖ్య ఇప్పుడు మూడు రెట్లు పెరిగి.. 9.2 శాతానికి చేరింది. ఈ పరిస్థితుల్లో.. పార్టీలు ప్రకటిస్తున్న హామీలు చూశాక.. దేశవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు.. వాటన్నింటిని ఎలా నెరవేరుస్తారని!
ఏదేమైనా ఇంకొన్ని రోజుల్లోనే బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయ్. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి. కీలక పొత్తుల్లో.. బీజేపీ, జేడీయూ.. ఎన్డీయే కూటమిగా బరిలో ఉన్నాయ్. మరోవైపు.. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలో మహా ఘట్ బంధన్ పోటీలో ఉంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన కొత్త పార్టీ జన సురాజ్ పార్టీ కూడా గ్రౌండ్‌లోకి దిగింది. దాంతో.. బీహార్ ఎన్నికల్లో.. ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతోంది. మరి.. పార్టీలు ఇచ్చిన హామీలను నమ్మి.. ఏ పార్టీకి జనం పట్టం కడతారనేది.. ఇంకొద్దిరోజుల్లోనే తేలిపోతుంది.
Story by Anup, Big Tv