ట్రంప్ శాంతి చర్చలతో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోతుందనే అనుకున్నారంతా. కానీ మళ్లీ అది మొదలైంది. తాజా దాడుల్లో రక్తం ఏరులై పారింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని టెర్నోపిల్ నగరంపై రష్యా దాడి చేసింది. డ్రోన్‌లు, క్షిపణులతో జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం గమనార్హం. ముఖ్యంగా 9 భారీ బిల్డింగ్ లపై డ్రోన్ లు బాంబులు జారవిడిచాయి. ఈ దాడుల్లో 25 మంది చనిపోయారు. 15 మంది పిల్లలు సహా మొత్తం 73 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. 476 డ్రోన్‌లు, 48 క్షిపణులతో రష్యా విరుచుకుపడటాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా తప్పుబట్టింది. వాటిలో ఆరింటిని మినహా మిగతా అన్నింటినీ తాము ధ్వంసం చేశామని ఉక్రెయిన్ తెలిపింది.
ట్రంప్ సంగతేంటి?
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపుగా ఆగిపోయినట్టేనని ఇటీవల ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాలకు కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. కానీ వాటి అమలుపై ఇంకా స్పష్టత లేదు. ఈ గ్యాప్ లో యుద్ధం ముదిరిపోతోంది. దీంతో ట్రంప్ మరో ముందడుగు వేశారు. 28 సూత్రాలతో ఒక శాంతి ప్రణాళిక సిద్ధం చేశారు. దాన్ని ఇరు దేశాలకు పంపించి వారు దానికి అనుమతించేలా ఒత్తిడి చేస్తున్నారు.
28 సూత్రాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు, 28-అంశాల ప్రణాళికను సిద్ధం చేశారు. అమెరికా అధికారులు, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులతో కలసి చర్చించిన పిమ్మట దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ ప్రణాళికలో రష్యా, ఉక్రెయిన్.. రెండు దేశాల భద్రతకు హామీలిచ్చే అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రణాళికపై చర్చించేందుకు ఉక్రెయిన్ వెళ్లిన అమెరికా ప్రతినిధులు కీవ్‌లో ఉక్రెయిన్ అధికారుల సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌కు అవసరమైన భద్రతా హామీలు 28 సూత్రాల్లో ఉన్నాయని తెలిపారు.
వాస్తవానికి అమెరికా మధ్యవర్తిత్వంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉక్రెయిన్ భావిస్తోంది. అమెరికా శాంతి సందేశాలను చెవికెక్కించుకోని రష్యా, ఉక్రెయిన్ పై పట్టు సాధించాలని చూస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాలపై ఆంక్షలు విధించాలని రష్యా ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో ఉక్రెయిన్ ని NATO కూటమిలో చేర్చుకోకూడదని చెబుతోంది. యుద్ధంలో ఇతర దేశాలు కలుగజేసుకోవడం సరికాదని వాదిస్తోంది రష్యా. అటు ఉక్రెయిన్ మాత్రం ప్రపంచ దేశాల సాయం కోరుతోంది. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: కారుమూరి విడుదల.. వైసీపీ సంబరపడాల్సిన అవసరం ఉందా?
తాజాగా ట్రంప్ సిద్ధం చేసిన 28 సూత్రాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని ఉక్రెయిన్ భావిస్తోంది. అయితే ఈ ముసాయిదాలోని అన్ని అంశాలను ట్రంప్ ఇంకా బయటపెట్టలేదు. ఉక్రెయిన్ కి అనుకూలంగా ఉన్న కొన్ని పాయింట్లపై మాత్రమే ప్రస్కుతం చర్చ నడుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ మసాయిదా ప్రణాళికను ఉక్రెయిన్ అనుమతిస్తుందని అనుకోలేం. ప్రస్తుతానికి ట్రంప్ చేస్తున్నది ఒక ప్రయత్నం మాత్రమే. అది సక్సెస్ అవుతుందని ప్రపంచ దేశాలు కూడా విశ్వసించడం లేదు. అయితే ఈ 28 సూత్రాలు ఎంతవరకు శాంతిని చేకూరుస్తాయనేది వేచి చూడాలి.
Also Read: హైదరాబాద్‌కు జగన్.. కోర్టుకు వెళ్లకుండా, కొత్త ప్లాన్?