North Korea Fires Missiles: నార్త్ కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. బుధవారం మధ్యాహ్నం జపాన్ సముద్రం వైపు మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా జపాన్ సముద్రంలోకి తక్కువ రేంజ్ కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించింది. బుధవారం మధ్యాహ్నం 2:23 గంటలకు ఒక బాలిస్టిక్ క్షిపణి, జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి సమీపంలో పడిందని పేర్కొంది. ఈ క్షిపణి వల్ల విమానాలకు గానీ, నౌకలకు గానీ ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది.
బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంపై ప్యాంగ్‌యాంగ్‌కు జపాన్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఈ ప్రయోగాన్ని ఖండిస్తున్నట్లు జపాన్ తెలిపింది. ఈ ప్రయోగాన్ని మరింత విశ్లేషించడానికి జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలతో కలిసి పనిచేస్తోందని పేర్కొంది.
ఉత్తర కొరియా తూర్పు ప్రాంతంలోని వోన్సాన్ నుండి బుధవారం ఉదయం 8:50 గంటల సమయంలో అనేక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అవి సుమారు 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మధ్యాహ్నం ప్రయోగించిన క్షిపణిని కూడా వోన్సాన్ ప్రాంతం నుంచే ప్రయోగించారని దక్షిణ కొరియా ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికాతో ద్వైపాక్షిక, త్రైపాక్షిక భద్రతా సహకారాన్ని కొనసాగించాలని జపాన్, దక్షిణ కొరియా రక్షణ మంత్రులు బుధవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్ణయించాయి. జపాన్‌కు చెందిన షింజిరో కోయిజుమి, దక్షిణ కొరియాకు చెందిన ఆన్ గ్యూ బ్యాక్, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం గురించి ఈ సమావేశంలో చర్చించారు. దక్షిణ కొరియా సైనిక విమానంలో సౌదీ అరేబియా నుంచి జపానీయులను తరలించడంలో దక్షిణ కొరియా అందించిన సహాయాన్ని కోయిజుమి ప్రశంసించారు.
Also Read: కూతురితో కలిసి.. యుద్ద ట్యాంక్‌పై షికారు.. కిమ్ మామ స్టైలే వేరు!
ఉత్తర కొరియా మంగళవారం ప్యాంగ్ యాంగ్ సమీపం నుంచి ఒక క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా నిఘా సంస్థలు ఈ ప్రయోగాలను విశ్లేషిస్తున్నాయి. మంగళవారం ప్రయోగించిన క్షిపణిని మల్టిపుల్-లాంచ్ రాకెట్ సిస్టమ్ నుంచి లేదా బాలిస్టిక్ క్షిపణిగా గానీ ప్రయోగించి ఉంటారని నిఘా సంస్థలు భావిస్తున్నారు. దక్షిణ కొరియా మీడియా కథనాల ప్రకారం, ఈ బాలిస్టిక్ క్షిణపుణు ప్రయోగించిన కొద్ది సమయంలోనే అదృశ్యమయ్యాయని పేర్కొన్నాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను గుర్తించిన వెంటనే దక్షిణ కొరియా సైన్యం అప్రమత్తమైంది.