Putin Vs Trump: ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచుతున్న టారిఫ్‌లపై మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ట్రంప్ తీసుకున్న చర్యలను తప్పు బట్టారు. భారత్-చైనాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేసి అమెరికా బుక్కవుతుందని చెప్పకనే చెప్పారు. ఇంతకీ పుతిన్ మాటల వెనుక అసలేం జరుగుతోంది?
ట్రంప్ తీరుపై పుతిన్ రుసరుస
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై సుంకాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది అమెరికా. ఈ వ్యవహారంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నోరువిప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న విధానాలపై మండిపడ్డారు. గురువారం దక్షిణ సోచిలోని మీడియాతో పలు విషయాలు ప్రస్తావించారు పుతిన్.
మాస్కోతో చమురు వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని ట్రంప్ చేస్తున్న ఒత్తిడిని తప్పుబట్టారు. ట్రంప్ నిర్ణయాల వల్ల వాషింగ్టన్‌కే ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే, దాని ప్రభావం ప్రపంచంలోని ఇంధన ధరలపై పడుతుందన్నారు. అదే సమయంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచేలా చేస్తుందన్నారు.
అమెరికాకు ఇబ్బందులు తప్పవు-పుతిన్
ఇలాంటి చర్యల వల్ల అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని హెచ్చరించారు. అమెరికా విధించిన సుంకాల వల్ల భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను రష్యా నుంచి చమురు దిగుమతులు సమతుల్యం చేస్తాయని పుతిన్ వ్యాఖ్యానించారు. వాణిజ్య ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భారత్ నుంచి మరిన్ని వ్యవసాయ, మెడికల్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామన్నారు.
ALSO READ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై ఆయన సెటైర్లు
న్యూఢిల్లీ తనను తాను ఎవరి ముందు అవమానించడానికి ఎప్పటికీ అనుమతించదన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. బయటి దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గకూడదన్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీని పుతిన్ ప్రశంసించారు. ఆయనొక సమతుల్య, తెలివైన నాయకుడిగా వర్ణించారు. ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహ బంధం ఉందన్నారు. అలాంటి చర్యలు ఎప్పటికీ తీసుకోరని తనకు తెలుసన్నారు.
ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించనున్న విషయాన్ని పుతిన్ ఈ సందర్భంగా వెల్లడించారు. భారత్‌పై అదనంగా 25 శాంతం సుంకాలు విధించిన అమెరికా, ఆగస్టు నుంచి భారత ఎగుమతులపై 50 శాతానికి పెంచేసిన విషయం తెల్సిందే. ఇదికాకుండా మిగతా రంగాలపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
చిత్రపరిశ్రమతోపాటు కొన్ని రంగాలపై ఆయన దృష్టి పెట్టారు కూడా. అదే సమయంలో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు పుతిన్. అమెరికాకు తాము యురేనియం సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు ముందు భారత్‌ను పర్యటించనున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.