US Iran Seize Fire Pak Key: అమెరికా, ఇరాన్ రెండు వారాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చీ ప్రకటించారు. మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ముగించడానికి కృషి చేసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లకు కృతజ్ఞతలు అంటూ ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అరఘ్చీ నోట్ ను ట్రూత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. శాంతి చర్చలలో ఇస్లామాబాద్ కీలక పాత్ర పోషించిందని వాషింగ్టన్ ధృవీకరించింది.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పెట్టారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తమ మిత్రదేశాలతో కలిసి, లెబనాన్, ఇతర ప్రాంతాలతో సహా అన్నిచోట్లా తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. రెండు వారాల సీజ్ ఫైర్ కు ముందు అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మునీర్‌లతో మాట్లాడారని వార్త సంస్థలు ఉటంకించాయి. నివేదికల ప్రకారం, పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఖ్చీలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.
సీజ్ ఫైర్ ప్రకటనకు కొన్ని గంటల ముందు, ఈ రాత్రితో ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాషింగ్టన్, టెహ్రాన్ యుద్ధ విరమణకు ఎలా అంగీకరించగలిగాయి? దీనికి సమాధానంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీల మధ్య చర్చలకు పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ మధ్యవర్తిత్వంతో వహించారని తెలుస్తోంది. ఇస్లామాబాద్ మార్చి నెలాఖరు నుంచి గల్ఫ్ దేశాల్లో శాంతి కోసం కృషి చేస్తోంది. మిడిల్ ఈస్ట్ ఘర్షణలను తగ్గించేందుకు మార్చి 29న పాక్.. టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులతో చర్చించింది.
వాషింగ్టన్, టెహ్రాన్ రెండు దేశాలు యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయించడంతో.. పాకిస్తాన్ రహస్య చర్చలలో కీలక మధ్యవర్తిగా మారింది. అమెరికా 15 సూత్రాల ప్రతిపాదనను ఇరాన్‌కు చేరవేసి, ఆ తర్వాత ఇరాన్ డిమాండ్ లను తిరిగి వాషింగ్టన్‌కు మోసుకెళ్లింది పాకిస్తానే.
అమెరికాతో అరబ్ దేశాలకు ఉన్న సంబంధాలతో ఇరాన్ ఆ దేశాలను నమ్మడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దు దేశం. షరీఫ్, మునీర్‌లతో ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇరాన్, పాక్ కు మధ్య సన్నిహిత దౌత్య సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా, పాలస్తీనా సమస్య కారణంగా పాకిస్తాన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు తెగిపోయాయి. ఇస్లామాబాద్ ను టెహ్రాన్ విశ్వసించడానికి ఇది కూడా ఒక కారణం.
ఇక అమెరికా విషయానికొస్తే, గత ఏడాది నుండి పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపడ్డాయి. గాజాలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఉన్న ట్రంప్ శాంతి మండలిలో ఇస్లామాబాద్ భాగస్వామ్యమైంది. ట్రంప్ ఇప్పటికే పాకిస్థాన్ మిలిటరీ చీఫ్ మునీర్‌ను తనకు ఇష్టమైన ఫీల్డ్ మార్షల్ అని పేర్కొన్నారు. మునీర్‌కు అమెరికా, ఇరాన్ రక్షణ వ్యవస్థలలో బలమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో మునీర్ .. ఇరాన్, యూఎస్ చర్చల్లో కీలకమయ్యారు. దీనికి తోడు, పాకిస్తాన్‌కు ఇతర గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉండడంతో.. ఈ యద్ధం నుండి బయటపడటానికి పాక్ గల్ఫ్ దేశాలు నమ్మాయి.
Also Read: ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?
కాల్పుల విరమణ కోసం పాక్ తాపత్రయానికి మరొక కారణం ఉంది. పాక్ తన చమురు దిగుమతుల్లో అధిక భాగాన్ని మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అలాగే చాలా మంది పాకిస్తానీలు ఇరాన్ లో పనిచేస్తూ తమ స్వదేశానికి డబ్బు పంపిస్తుంటారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరలు పెంచాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌కు వచ్చింది. దీంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.