Obama Arrest Trump AI Video| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాత ప్రత్యర్థి, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసారి ఆయనను అవమానిస్తూ ఒక ఏఐ వీడియో విడుదల చేశారు. త్వరలోనే ఆయన అరెస్ట్ అవుతారని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్‌లో ఒక ఫేక్ వీడియో ద్వారా తెలిపారు. ఈ వీడియోలో ఒబామాను ఎఫ్‌బిఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు అరెస్ట్ చేస్తున్నట్లు చూపించారు. ఒబామా ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేసిన ఓవల్ ఆఫీస్ (అధ్యక్ష భవనం)లో ఈ సన్నివేశం జరిగినట్లు చిత్రీకరించబడింది.
వీడియో ప్రారంభంలో ఒబామా స్వయంగా ప్రసంగిస్తూ.. “అధ్యక్షుడు చట్టానికి అతీతుడు ” అని చెబుతున్నట్లు ఓ సీన్ చూపించబడింది. ఆ తర్వాత, అనేక మంది అమెరికా రాజకీయ నాయకులు “ఎవరూ చట్టానికి అతీతులు కాదు” అని పునరుద్ఘాటిస్తూ కనిపిస్తారు. ఆ తర్వాత, వీడియోలో ఒబామాను ఇద్దరు ఎఫ్‌బిఐ ఏజెంట్లు సంకెళ్లు వేసి అరెస్ట్ చేసే దృశ్యం వస్తుంది. ఈ సమయంలో ట్రంప్ ఆ గదిలో కూర్చొని నవ్వుతూ కనిపిస్తాడు. చివరగా, ఒబామా జైలు యూనిఫాంలో, అంటే నారింజ రంగు దుస్తుల్లో, జైలు గదిలో నిలబడి ఉన్న దృశ్యంతో వీడియో ముగుస్తుంది.
ఈ వీడియో పూర్తిగా కృత్రిమంగా తయారు చేయబడింది..అయినా ఈ వీడియో నిజం కాదని ట్రంప్ ఎటువంటి హెచ్చరిక లేదా వివరణ ఇవ్వలేదు. ఈ చర్యను ట్రంప్ విమర్శకులు, ప్రతిపక్ష నాయకులు, డెమోక్రాట్లు తీవ్రంగా ఖండించారు. అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ ఇలాంటి వీడియో పోస్ట్ చేయడం.. “బాధ్యతారహిత చర్య” అని పిలిచారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా భారీగా మోసాలకు పాల్పడ్డారని ట్రంప్ వాదించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజాగా ఒక ఏఐ వీడియోను పోస్ట్ చేశారని తెలుస్తోంది.
గత వారం, అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2016 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆయన అధ్యక్ష పదవిని చేపట్టకుండా అడ్డుకోవడానికి ఒబామా బృందం తప్పుడు ప్రచారం చేసిందని గబ్బర్డ్ ఆరోపించారు. ట్రంప్‌నకు రష్యాతో సంబంధాలు ఉన్నాయని.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఒబామా బృందం అసత్య ఆరోపణలు చేశారని ఆమె తెలిపారు. ఈ విషయంలో తన వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని గబ్బర్డ్ పేర్కొన్నారు. ఒబామా పరిపాలనలో పనిచేసిన అధికారులపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలు అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం రేపాయి. ట్రంప్ తన ఆరోపణలను మరింత బలంగా వినిపించడానికి ఈ వీడియోను ఉపయోగించినట్లు కనిపిస్తోంది. అయితే, ఈ వివాదం చట్టం, నీతి, బాధ్యతలపై మరోసారి చర్చను రేకెత్తించింది.