Gold Facial: ముఖం తెల్లగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ఇందుకోసం చాలా మంది రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అంతే కాకుండా కొంతమంది పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇలా పార్లర్‌కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయకుండా.. సహజ సిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు.
ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా.. రక్త ప్రసరణను పెంచి, చర్మానికి బంగారు మెరుపును అందిస్తుంది. గోల్డ్ ఫేషియల్ అనగానే నిజమైన బంగారం అనుకోవద్దు. చర్మానికి బంగారు మెరుపును అందించి ముడతలను తగ్గించే ఈ ఫేషియల్ ను కొన్ని సహజ పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.
గోల్డ్ ఫేషియల్ కోసం అవసరమైన సహజ పదార్థాలు:
క్లెన్సర్ (శుభ్రపరచడానికి): పచ్చి పాలు
స్క్రబ్ (మృత కణాలను తొలగించడానికి): బియ్యం పిండి, పాలు
మసాజ్ క్రీమ్: కలబంద గుజ్జు , కుంకుమపువ్వు, తేనె
ఫేస్ ప్యాక్: శనగపిండి, పసుపు, పాలు/రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మరసం (సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మరసం వాడకపోవడం మంచిది)
ఇంట్లో గోల్డ్ ఫేషియల్ చేసే విధానం:
స్టెప్- 1: క్లెన్సింగ్ (శుభ్రపరచడం): ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పచ్చి పాలు తీసుకోండి. తర్వాత దూదిని పాలలో ముంచి, దానితో మీ ముఖం, మెడను సున్నితంగా తుడవండి. 5 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. ఇది చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి, మేకప్‌ను తొలగించి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
స్టెప్- 2: స్క్రబ్బింగ్ : ఒక టీస్పూన్ బియ్యం పిండిలో సరిపడా పాలు కలిపి పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి, వేళ్లతో సున్నితంగా వృత్తాకార కదలికలతో 2-3 నిమిషాలు స్క్రబ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. బియ్యం పిండి మృత కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
స్టెప్- 3: మసాజ్ (రక్త ప్రసరణ కోసం): ఒక గిన్నెలో 2 టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జు, చిటికెడు కుంకుమపువ్వు, ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలపండి. ఈ క్రీమ్‌ను ముఖం, మెడపై అప్లై చేసి, వేళ్లతో పైకి, బయటికి కదలికలతో 10-15 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి.
మసాజ్ తర్వాత తడి టవల్‌తో తుడవండి లేదా నీటితో శుభ్రం చేసుకోండి.కలబంద చర్మానికి తేమను అందిస్తుంది, కుంకుమపువ్వు మెరుపును ఇస్తుంది, తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
Also Read: స్కాల్ప్ మసాజ్‌తో మ్యాజిక్.. లాభాలు తెలిస్తే షాక్ అవుతారు !
స్టెప్- 4: ఫేస్ ప్యాక్ :
ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్‌స్పూన్ల శనగపిండి, చిటికెడు పసుపు, సరిపడా పాలు లేదా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా కలపండి. ఒకవేళ మీ చర్మం జిడ్డుగా ఉంటే, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ ప్యాక్‌ను ముఖం, మెడపై సమానంగా అప్లై చేయండి. తర్వాత 20 నిమిషాలు ఆరనివ్వండి. ప్యాక్ ఆరిన తర్వాత, గోరువెచ్చని నీటితో సున్నితంగా రుద్దుతూ కడిగేయండి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ తో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. ముఖానికి మంచి మెరుపు అందుతుంది.