Migrants In US : ట్రంప్ పరిపాలనలో వలసల విధానంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే.. అనేక దేశాల నుంచి అక్రమంగా దేశంలోని ప్రవేశించిన వారిని… స్వదేశాలకు తరిమేసిన ట్రంప్, తాజాగా… ఆ దేశంలో తాత్కాలిక వలసదారులపై గురి పెట్టారు. అమెరికాలోని దాదాపు 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరిలో.. క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వాన్లు, వెనిజులా ప్రజలున్నారు. వీరికి దేశంలోని చట్టపరమైన రక్షణలను రద్దు చేసినట్లుగా ప్రకటించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం.. వీరిని రానున్న నెలలో బహిష్కరించే అవకాశం ఉందని తెలిపింది.
అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఈ ఆర్డర్ అక్టోబర్ 2022 నుంచి నాలుగు దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించిన.. దాదాపు 5.32 వేల మందికి వర్తిస్తుంది. వీరంతా ఇతరుల ఆర్థిక సహకారంతో అమెరికాలోకి రాగా.. ఇక్కడ నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు రెండేళ్ల పాటు తాత్కాలిక అనుమతులు పొందారు. వీరంతా మానవతా పెరోల్ కింద చేపట్టిన చర్యల్లో భాగంగా యూఎస్ వచ్చేందుకు అనుమతులు పొందారు. కాగా.. ఈ ఆర్డర్ ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసు ప్రచురించిన 30 రోజుల తర్వాత వారి0 చట్టపరమైన హోదాను కోల్పోతారని హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది.
వాస్తవానికి అంతర్జాతీయంగా యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న దేశాల్లోని ప్రజలకు అమెరికాలోని ప్రవేశించేందుకు, తాత్కాలికంగా నివసించేందుకు ఈ పెరోల్ వినియోగిస్తుంటారు. ఈ విధానం యూఎస్ అధ్యక్షులు ఉపయోగించిన దీర్ఘకాల చట్టపరమైన సాధనం. అయితే.. మానవతా పెరోల్ విస్తృతంగా దుర్వినియోగం అవుతుందని, దీనిని త్వరగా ముగించాలని ట్రంప్ ఎన్నికల సమయం నుంచి వాదిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇటీవలి ఎన్నికల ప్రచారంలో అక్రమంగా అమెరికాలో ఉన్న లక్షలాది మందిని బహిష్కరిస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించన తర్వాత వలసదారులు అమెరికాకు వచ్చి ఉండేందుకు ఉన్న చట్టబద్ధమైన మార్గాలను మూసేసిన ట్రంప్.. గతంలో జారీ చేసిన పెరోల్ ముగింపు తేదీకి ముందే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. పెరోల్ అనేది సహజంగానే తాత్కాలికమైనది, అలాగే..పెరోల్ మాత్రమే ఏదైనా ఇమ్మిగ్రేషన్ హోదా పొందడానికి ప్రాథమిక ఆధారం కాదు అని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అంటున్నారు.
తాజా ఉత్తర్వు జారీ కావడానికి ముందే.. ఈ కార్యక్రమం కింద ప్రయోజనాలు పొందిన లబ్ధిదారులు.. వారి పెరోల్ గడువు ముగిసే వరకు USలోనే ఉండే అవకాశం ఉంది. కానీ.. వారి ఆశ్రయం, వీసాలు, గడువు ముగిసిన తర్వాత ఎక్కువ కాలం అక్కడే ఉండేందుకు ఉన్న ఇతర అభ్యర్థనలను పక్కన పెట్టేస్తూ వస్తున్నారు. అలాగే.. చాలా మంది లబ్దిదారులు.. ట్రంప్ తీసుకున్న ఈ పరిపాలన పరమైన నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టులలో సవాలు చేశారు.
Also Read : Houti Rebels | మళ్లీ విరుచుకుపడిన హౌతీలు.. బ్రిటన్ షిప్‌పై మిసైల్ దాడులు!
మానవతా పెరోల్‌ను ముగించినందుకు ట్రంప్ పరిపాలనపై అమెరికన్ పౌరులు, వలసదారుల మద్ధతుదారులు కోర్టులో దావా వేశాయి. ఈ ఉత్తర్వుల్ని కొట్టివేసి.. నాలుగు దేశాలకు చెందిన వలసదారులకు గతంలో కల్పిస్తున్న ప్రయోజనాల్ని అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ న్యాయవాదులు, కార్యకర్తలు తమ గళాలను వినిపించారు.