Fighter Jet Crashes: పోలాండ్‌లో ఘోర వైమానిక ప్రమాదం చోటు చేసుకుంది. రెడమ్ నగరంలో జరగాల్సిన ఎయిర్‌షో ప్రాక్టీస్ సందర్భంగా పోలిష్ వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోవడంతో సైన్యంలో ఒక పైలట్ మృతి చెందాడు. పోలాండ్ ఉప ప్రధాని వ్లాడిస్లావ్ కోసినియాక్ కమిష్ ఈ విషాద ఘటనను ప్రస్తావించారు. దేశానికి అంకితభావంతో, ధైర్యసాహసాలతో సేవలందించిన ఆ అధికారి మరణం వాయుసేనకు మాత్రమే కాదు, మొత్తం సైన్యానికే ఒక పెద్ద నష్టమని ఆయన తెలిపారు.
రాత్రి 11 గంటలకు ఘటన
ఈ ప్రమాదం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో, ఎఫ్-16 యుద్ధ విమానం ఒక ప్రమాదకరమైన బారెల్-రోల్ మానవర్ చేస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి నేలపై పడి అగ్నిగోళంలా పేలిపోవడం, మంటల్లో కూరుకుపోయిన విమానం రన్‌వేపై కొంత దూరంలో పడటం స్పష్టంగా కనిపించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం ప్రకటించింది. భారతీయ సమయానికి రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోజ్నాన్ సమీపంలోని 31వ టాక్టికల్ ఎయిర్‌బేస్‌కి చెందిన విమానం ఈ దుర్ఘటనలో భాగమని సైన్యం వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ప్రజలు గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలో జరగాల్సిన ఎయిర్‌షో రెడమ్ 2025ను అధికారులు రద్దు చేసినట్టు ప్రకటించారు.
ఉప ప్రధాని కోసినియాక్-కమిష్ సోషల్ మీడియాలో పోస్ట్
ప్రమాదం అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న ఉప ప్రధాని కోసినియాక్-కమిష్ సోషల్ మీడియాలో స్పందించారు. “ఎఫ్-16 విమాన ప్రమాదంలో ఒక పోలిష్ ఆర్మీ పైలట్ మరణించారు. ఎల్లప్పుడూ ధైర్యంగా, అంకితభావంతో దేశ సేవలో నిలిచిన అధికారిని కోల్పోయాం. ఆయన జ్ఞాపకార్థం నివాళులర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
కూలిన ఎఫ్-16 యుద్ధ విమానం..
పోలాండ్ లోని రాడోమ్ లో ఎయిర్ షో రిహార్సల్స్ లో అపశృతి
ఫైటర్ జెట్ కూలిన ఘటనలో ఆర్మీ పైలట్ మృతి pic.twitter.com/ROknjecXu5
— BIG TV Breaking News (@bigtvtelugu) August 29, 2025