అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ పాలిటన యమకింకరుడుగా మారాడనే చెప్పుకోవాలి. సుంకాల మోత మోగించి భారత ఎగుమతులకు అడ్డుకట్ట వేస్తూ, భారత విదేశీ వాణిజ్యాన్ని చావుదెబ్బ కొడుతున్న ట్రంప్, తాజాగా వీసా బాంబ్ పేల్చడానికి సిద్ధమయ్యారు. H1B, గ్రీన్ కార్డ్ జారీల్లో మార్పులను ట్రంప్ ప్రతిపాదించారు. వీటి వల్ల అమెరికా వెళ్లి జీవించాలనే భారతీయుల కల నెరవేరడం ఇకపై అంత ఈజీ కాదు.
ఐటీ నిపుణులకు దడ..
H1B, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలను పునరుద్ధరించాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని వల్ల విదేశాలనుంచి వెళ్లి అమెరికాలో పనిచేసే వారికి ఇబ్బందులు మొదలవుతాయి. ఇక్కడ విదేశీయులు అంటే ముఖ్యంగా ఇండియన్స్ అని అర్థం. ఎందుకంటే ఎక్కువగా భారత్ నుంచే ఈ వలసలు కనపడుతున్నాయి. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అయిన H1Bని భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీంతోపాటు గ్రీన్ కార్డ్ ప్రక్రియలో కూడా మార్పులు తీసుకురావాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఈమేరకు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కీలక ప్రకటన జారీ చేశారు. H1B ప్రోగ్రామ్ లో మార్పులకోసం ఏర్పాటు చేసిన కమిటీలో తాను కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు.
ట్రంప్ కి ఎందుకంత కోపం..?
సగటు అమెరికన్ సంపాదన 75 వేల యూఎస్ డాలర్లుగా ఉంటే, సగటు గ్రీన్ కార్డ్ గ్రహీత సంపాదన అమెరికాలో 66 యూఎస్ డాలర్లుగా ఉంటుంది. ఇక్కడ తాము అట్టడుగు గీతను దాటబోతున్నట్టు తెలిపారు లుట్నిక్. అందుకే తాము గోల్డ్ కార్డ్ ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. గ్రీన్ కార్డ్ రూల్స్ మారాల్సిన సమయం వచ్చిందని అన్నారాయన.
అమెరికన్లకోసమేనా..?
H-1B వీసాల ద్వారా భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాలో తిష్ట వేస్తున్నారనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోకూడా ఆయన ఈ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. విదేశాలనుంచి తరలి వస్తున్న ఉద్యోగుల వల్ల అమెరికా యువత నష్టపోతోందని చెప్పేవారు. ఇప్పుడు ఆ వలసలకు అడ్డుకట్ట వేయబోతున్నారని తెలుస్తోంది. ప్రతి ఏటా H-1B వీసాలతో భారత్ నుంచి 65వేలమంది అమెరికా వెళ్తున్నారు. అమెరికాలో ఉన్నత చదువులకోసం వెళ్లిన వారు మరో 20వేల మంది H-1B వీసాలు పొందుతున్నారు. ఇకపై ఇంత పెద్ద సంఖ్యలో వలసదారుల్ని తీసుకొచ్చి ఉద్యోగాలివ్వడం సరికాదంటున్నారు ట్రంప్. అందుకే నిబంధనలు కఠిన తరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
H-1B స్కామ్..
H-1B వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు మారుస్తామంటున్న అమెరికా ఉన్నతాధికారులు అసలు H-1B వీసాల జారీని పెద్ద స్కామ్ గా చెబుతున్నారు. కొన్ని కంపెనీలు H-1B వీసాల విషయంలో మోసాలకు పాల్పడుతున్నాయని అంటున్నారాయన. ఈ స్కామ్ ద్వారా అమెరికా తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. అంతే కాదు. అమెరికన్ యువతకు కూడా నష్టం జరుగుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందని, అదే సమయంలో H-1B వీసా ద్వారా అమెరికాకు వలస వచ్చే భారతీయుల సంఖ్య మాత్రం తగ్గడం లేదన్నారు. అంటే ఇక్కడ నష్టం స్పష్టంగా అమెరికన్లపైనే పడుతోందని ఆయన తెలిపారు. దీన్ని నివారించేందుకు భారతీయ వలస ఉద్యోగుల మెడపై కత్తి పెట్టేందుకు ట్రంప్ సిద్ధమయ్యారనమాట.