
Kubernetes : ప్రస్తుతం ఐటీలో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు వచ్చేది ‘క్యూబర్‌నెటిస్’లో ప్రావీణ్యం ఉందా? అనే సందేహం. వివిధ అప్లికేషన్లను ఉపయోగించడంలో క్యూబర్‌నెటిస్ ముఖ్యమైన టెక్నాలజీ. దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా డెవలపర్, అడ్మినిస్ట్రేటర్‌గా భవిష్యత్ అవకాశాలు పొందొచ్చు.
2014లో తొలిసారిగా క్యూబర్‌నెటిస్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ కంటైనర్లతో అనుసంధానమై ఉన్న పనులను ఆటోమేట్ చేస్తుంది. దీన్ని అభివృద్ధి చేసే వరకూ గూగుల్ డాకర్‌ను ఉపయోగించింది. క్యూబర్‌నెటిస్ వచ్చాక.. పరిశ్రమకు పూర్తిస్థాయిలో ఉపయోగపడగలదు అని గమనించి ఉచిత, ఓపెన్‌సోర్స్ ప్రాజెక్టుగా విడుదల చేసింది. ఇప్పుడది విజయవంతంగా నడుస్తోంది. 2022 చివరినాటికి 61% పైగా సంస్థల్లో కంటైనర్ ఆర్కెస్ట్రేషన్‌కోసం క్యూబర్‌నెటిస్‌నే ఉపయోగిస్తున్నారు. ‘2022 స్టాక్ ఓవర్‌ఫ్లో డెవలపర్ సర్వే’ ప్రకారం.. క్యూబర్‌నెటిస్ ఇంజినీర్లకు రానున్న కాలంలో మరింత డిమాండ్ పెరగనుందని నిపుణుల అంచనా.
కోర్సులు..
క్యూబర్‌నెటిస్ సర్టిఫికేషన్ కోర్సులు ఎడ్‌ఎక్స్, ఎడ్యురేకా, అప్‌గ్రాడ్, కోర్సెరా, యుడెమీ లాంటి లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి నేర్చుకోవచ్చు. క్యూబర్‌నెటిస్ ఫర్ బిగినర్స్, డెవోప్స్ విత్ క్యూబర్‌నెటిస్, కోర్ కాన్సెప్ట్స్, క్యూబర్‌నెటిస్ ఫర్ డెవలపర్స్‌వంటి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కొలువులు..
క్యూబర్‌నెటిస్ సర్టిఫికేషన్‌తో డెవలపర్, అడ్మినిస్ట్రేటర్‌గానూ వెళ్లొచ్చు. సర్టిఫైడ్ క్యూబర్‌నెటిస్ అప్లికేషన్‌డెవలపర్, అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ స్పెషలిస్ట్.. ఇలా పలు ఉద్యోగాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.