Stock Market : భారత స్టాక్ మార్కెట్లలో వచ్చే వారం 4 ఐపీఓలు సందడి చేయబోతున్నాయి. గ్లోబల్ హెల్త్, ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్, డీసీఎక్స్ సిస్టమ్స్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఐపీఓలు… ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.4,500 కోట్లు సమీకరించబోతున్నాయి.
కేబుల్స్, వైర్ హార్నెస్ అసెంబ్లీని తయారు చేసే డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీఓ అక్టోబరు 31న మొదలైన నవంబరు 2న ముగుస్తుంది. రూ.500 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకి వస్తున్న ఈ కంపెనీ… ఒక్కో షేరు ధరను రూ.197 నుంచి రూ.207గా నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూలో సమీకరించిన నిధులతో రుణ భారం తగ్గించుకోవాలనుకుంటోంది… డీసీఎక్స్ సిస్టమ్స్.
ఇక ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ నవంబరు 2-4 మధ్య పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. రూ.1,104 కోట్లు సమీకరించబోతున్న ఈ కంపెనీ… ఒక్కో షేరు ధరను రూ.350 నుంచి రూ.368గా నిర్ణయించింది. గ్లోబల్ హెల్త్, బికాజీ ఫుడ్స్ ఐపీఓలు… నవంబరు 3-7 మధ్య రానున్నాయి. మేదాంతా పేరుతో ఆస్పత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్… రూ.2,206 కోట్లు సమీకరించబోతోంది. ఒక్కో షేరు ధరను రూ.319 నుంచి రూ.336గా నిర్ణయించింది. అప్పుల్ని తగ్గించుకోవడంతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వాడుకుంటారు. ఇక బికాజీ ఫుడ్స్ రూ.1,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఏడాది ఇప్పటిదాకా ఐపీఓకి వచ్చిన 22 కంపెనీలు… ఇన్వెస్టర్ల నుంచి రూ.44,000 కోట్లు సమీకరించాయి. 2021లో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన 63 కంపెనీలు… ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు సేకరించాయి. స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకుల వల్ల ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ బలహీనంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.